Telangana Congress: కాంగ్రెస్‌లోకి క్యూ క‌డుతున్న నేత‌లు.. రాజ‌గోపాల్‌రెడ్డి కూడా వ‌స్తున్నారా?

కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి శుక్ర‌వారం ఢిల్లీలో ప్రియాంక గాంధీతో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా మీ సోద‌రుడు రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా అని అడిగార‌ని చెప్పారు.

  • Written By:
  • Updated On - June 16, 2023 / 10:08 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) లో జోష్ పెరుగుతోంది. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నాకొద్దీ ఆ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టికే మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ అమెరికా టూర్ ముగించుకొని వ‌చ్చిన త‌రువాత ఖ‌మ్మం, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల్లో వేరువేరుగా స‌భ‌లు నిర్వ‌హించి వీరు కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకోనున్న‌ట్లు స‌మాచారం. ఇదే విష‌యాన్నిఏఐసీసీ సెక్ర‌ట‌రీ, మాజీ ఎమ్మెల్యే సంప‌త్ కుమార్ మీడియాకు తెలిపారు. వీరితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోద‌ర్ రెడ్డికూడా కాంగ్రెస్‌లో చేరుతార‌ని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ‌రెడ్డి, ఇత‌రులుసైతం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇత‌ర పార్టీల నేత‌ల చేరికల‌ వ్య‌వ‌హారాల‌న్నీ బెంగ‌ళూరు వేదిక‌గా కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌, బీజేపీలోని అసంతృప్త నేత‌ల‌పై దృష్టిసారించిన తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు వారితో మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. మ‌రోవైపు ఇటీవ‌ల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన వారుసైతం తిరిగి కాంగ్రెస్‌లోకి వ‌స్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. వీరిలో బీజేపీ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక‌పై ఆయ‌న సోద‌రుడు, కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి శుక్ర‌వారం ఢిల్లీలో ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీతో స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో వీరి మ‌ధ్య‌ తెలంగాణలో రాజ‌కీయాల‌పై చ‌ర్చ జ‌రిగింది. అనంత‌రం వెంక‌ట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. క‌ర్ణాట‌క త‌ర‌హాలో టికెట్లు ముందుగానే ప్ర‌క‌టించ‌డంతోపాటు ప్ర‌తి 10రోజుల‌కు ఒక‌సారి రాష్ట్రానికి రావాల‌ని ప్రియాంక గాంధీని కోరాన‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మీ సోద‌రుడు రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేర‌బోతున్నారా? అని ప్రియాంకా గాంధీ అడిగార‌ని.. అంద‌రూ కాంగ్రెస్‌లోకి వ‌స్తార‌ని వెంక‌ట్‌రెడ్డి చెప్పారు. వెంక‌ట్‌రెడ్డి తాజా వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టిచూస్తుంటే రాజ‌గోపాల్ రెడ్డి  తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వ‌స్తున్నార‌న్న ప్ర‌చారానికి బ‌లం చేకూరిన‌ట్ల‌యింది.

Chittoor District: పాడె మోస్తూ ముగ్గురు మృతి.. అంత్య‌క్రియ‌ల్లో విషాదం