Site icon HashtagU Telugu

JP Nadda : తెలంగాణలో ‘న‌డ్డా’ కాక‌

Jp Nadda

Jp Nadda

తెలంగాణ పొలిటిక‌ల్ సీన్ హుజారాబాద్ ఫ‌లితాల త‌రువాత అనూహ్యంగా మారిపోతోంది. నువ్వా? నేనా? అన్న‌ట్టు గులాబీ, క‌మ‌ల నాథులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇది నిజ‌మా? మైండ్ గేమా? అనే అనుమానం కూడా క‌లుగుతోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ అన్న‌ట్టు దండోరా జ‌రిగింది. హుజురాబాద్ ఫలితాల త‌రువాత కాంగ్రెస్ దండోరా గ్రౌండ్ ను బీజేపీ హైజాక్ చేసింది. ఆ అవ‌కాశాన్ని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇచ్చాడ‌ని పొలిటిక‌ల్ టాక్‌.హుజారాబాద్ ఫ‌లితాల త‌రువాత వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో తాడోపేడో తేల్చుకుంటాన‌ని సీఎం కేసీఆర్ మీడియా ముందుకొచ్చాడు. మోడీ స‌ర్కార్ ను టార్గెట్ చేయ‌డంతో పాటు చైనా, భార‌త్ స‌రిహ‌ద్దుల్లో ఏం జ‌రుగుతుందో చూసుకోండంటూ..కేంద్రానికి చుర‌క‌లు వేశాడు. అంతేకాదు, ప్ర‌తి రోజూ మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌డం ద్వారా నిజాల‌ను బ‌య‌ట‌పెడ‌తాన‌ని హూంక‌రించాడు. ఇంకేముంది కేంద్రానికి, రాష్ట్రానికి మ‌ధ్య వార్ జ‌రుగుతుంద‌ని అంద‌రూ భావించారు. ఆ దిశ‌గా కేసీఆర్ అడుగులు చాలా స్పీడ్ గా ప‌డ్డాయి.

తెలంగాణ వ్యాప్తంగా కేంద్రంపై టీఆర్ఎస్ నిర‌స‌న‌ల‌కు దిగింది. ఇందిరా పార్కు వ‌ద్ద కేసీఆర్ ఒక రోజు దీక్ష‌కు దిగాడు. ఆ త‌రువాత ఛ‌లో ఢిల్లీ అంటూ హ‌స్త‌న‌లో తేల్చుకుంటామ‌ని వెళ్లాడు. ఉత్త చేతుల‌తో తిరిగి వ‌చ్చిన త‌రువాత క్షేత్ర‌స్థాయిలో రైతుల‌కు అవ‌గాహ‌న పెంచాల‌ని ఆలోచించాడు. ఆ మేర‌కు క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేశాడు. పోటీగా క‌మ‌ల‌నాథులు కూడా కదం తొక్కారు.పార్లమెంట్ వేదిక‌గా ఎంపీలు వ‌రిధాన్యం కొనుగోలు గురించి నిల‌దీయాల‌ని కేసీఆర్ ఆదేశించాడు. ఆ మేర‌కు ఒక‌టి రెండు రోజులు పార్ల‌మెంట్ వేదిక‌గా పోరాట చిత్రాన్ని న‌డిపారు. అక‌స్మాత్తుగా ఆందోళ‌న విర‌మించి హైద‌రాబాదుకు వ‌చ్చేశారు. పార్ల‌మెంట్ జ‌రుగుతుండ‌గా..వాళ్లు రావ‌డం విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. దీంతో మంత్రుల‌ను ఢిల్లీ వెళ్లి తేల్చుకురాండంటూ కేసీఆర్ ఆదేశించాడు. అంద‌రూ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కెళ్లారు. ఆక‌స్మాత్తుగా క్రిస్మ‌స్ ముందు రోజు హైద‌రాబాద్ కు వాళ్లూ తిరిగి వ‌చ్చేశారు. అటు ఎంపీలు ఇటు మంత్రులు ఢిల్లీలో ఏం సాధించార‌ని ప్ర‌శ్నిస్తే..మౌనమే స‌మాధానంగా ఉంది.

వ‌రి ధాన్యం కొనుగోలు అంశంపై పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్రంగా చాలా స్ప‌ష్టంగా లెక్క‌ల‌ను బ‌య‌ట‌పెట్టింది. కేంద్ర మంత్రులు మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ స‌ర్కార్ చేస్తోన్న మ‌త‌ల‌బును వివ‌రించారు. దీంతో అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ మ‌ధ్య న‌డిచిన వ‌రి ధాన్యం కొనుగోలు వార్ స‌ద్దుమ‌ణిగింది. ఇంత‌లో 317 జీవోను ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌డంపై బీజేపీ ఫైర్ అయింది. ఉద్యోగుల బ‌దిలీలు ఆ జీవో ఆధారంగా చేస్తే చాలా న‌ష్ట‌పోతార‌ని ఆందోళ‌న‌కు దిగింది. రాత్రి జాగ‌ర‌ణ‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్ పూనుకున్నాడు. ఆయ‌న క్యాంపు ఆఫీస్ లో జ‌రిగిన ఆ జాగ‌ర‌ణను భ‌గ్నం చేయ‌డానికి పోలీసులు చేసిన ఓవ‌రాక్ష‌న్ పొలిటిక‌ల్ హీట్ ను పెంచింది. కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘ‌న సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసి ఆరెస్ట్ చేశారు. కోర్టు బండికి 14 రోజుల రిమాండ్ వేసింది. దీంతో కేసీఆర్ పై బీజేపీ భ‌గ్గ‌మంటోంది.క‌రీంన‌గ‌ర్ కేంద్రంగా జ‌రిగిన బండి జైలుకు వెళ్లిన సంఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా బీజేపీ 14 రోజుల పోరాటానికి పిలుపు ఇచ్చింది. సంఘీభావం తెల‌ప‌డానికి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా ఢిల్లీ నుంచి వ‌చ్చాడు. శంషాబాద్‌ ఎయిర్ పోర్టులోనే ఆయ‌న్ను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. కొవ్వెత్తుల ర్యాలీకి అనుమ‌తి లేద‌ని వెన‌క్కు పంపే ప్ర‌య‌త్నం టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య జ‌రుగుతోన్న రాజ‌కీయ యుద్ధంలోని హైలెంట్ పాయింట్.

తెలంగాణ బీజేపీ అగ్ర‌నేత‌లు రాష్ట్ర పార్టీ కార్యాల‌యంలో మౌన దీక్ష‌ను చేస్తున్నారు. మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా కేంద్రాల్లోనూ నిర‌స‌న‌ల‌కు దిగారు. దీంతో ఢిల్లీ నుంచి తెలంగాణ గ‌ల్లీల వ‌ర‌కు టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య రాజ‌కీయ ప‌ర‌మైన వార్ న‌డుస్తోంది. ఫ‌లితంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా ఉంది. ఇటీవ‌ల రెండు రోజుల పాటు పీసీసీ చీఫ్ రేవంత్ ను గృహ‌నిర్బంధం చేయ‌డం ద్వారా మీడియా వేదిక‌గా ఫోక‌స్ అయ్యాడు. ఆ ఫోక‌స్..ఇప్పుడు పూర్తిగా బండి సంజ‌య్ అరెస్ట్ వైపు మ‌ళ్లింది. మ‌రో రెండు వారాల పాటు ఇదే టెన్ష‌న్ కొన‌సాగించేలా బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్ వేసింది. జాతీయ అధ్యక్షుడు న‌డ్డా కూడా రంగంలోకి దిగ‌డంతో ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేస్తుందో చూద్దాం.