BJP : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు కీలక ప్రకటన చేశారు. బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే బీజేపీ పూర్తిగా మద్దతిస్తుందని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తున్న ధర్నాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మద్దతుగా పోరాడినట్లు చూపించేందుకు, హైదరాబాద్‌లో చేసినట్టు ఇప్పుడు ఢిల్లీలోనూ నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీసీల రిజర్వేషన్ల పట్ల ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. రాష్ట్రం బీసీలకు అన్యాయం చేస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించలేదు. ఇప్పుడు మాత్రం ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకోవడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయి అని ఆయన ఆరోపించారు.
Read Also: Blood Purify Foods : ఏ ఆహారం రక్తాన్ని శుద్ధి చేస్తుంది?.. రోజూ ఈవి తింటే ఎలాంటి వ్యాధులు రావు..!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనేది చట్టపరంగా, రాజ్యాంగ పరంగా సమర్థించదగినదే అని అన్నారు. ముస్లింలకు 10 శాతం ఇవ్వాలంటే, అదే వాటా బీసీలకు తగ్గుతుంది. దీని వలన బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అటువంటి నిర్ణయాన్ని మేము ఒప్పుకోలేం. కానీ బీసీలకే 42 శాతం అమలు చేస్తామంటే బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది అని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. బీజేపీ రిజర్వేషన్లను అడ్డుకుంటోందని కాంగ్రెస్ చెబుతోంది. ఇది పూర్తిగా అసత్యం. నిజానికి బీసీల సమస్యలను తాము లేపి, మద్దతు ఇస్తున్న పార్టీ బీజేపీనే. కాంగ్రెస్ ఈ విషయంలో పక్కదారి పట్టించి ప్రజలను తప్పుదారి పట్టించాలనుకుంటోంది. కానీ బీసీలు ఇప్పుడు అవగాహన కలిగి ఉన్నారు. ఈ దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితిలో వారు లేరు అని రామచందర్ రావు స్పష్టం చేశారు.
ఇక, ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశం లేదు. బీసీలకు హక్కులిచ్చే వ్యవస్థలో భాగంగా ఈ ఎన్నికలు జరగాలి. కానీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ. స్థానిక సంస్థల ద్వారా బీసీలకు నాయకత్వం రావడం, పాలనలో భాగం కావడం ప్రభుత్వానికి ఇష్టం లేదు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల సంక్షేమం పెద్దగా ప్రాధాన్యం కాదు అని ఈ సందర్భంలో పేర్కొన్నారు. ఒక్కోసారి రిజర్వేషన్ల పేరుతో ముస్లింలను మెప్పించాలన్న దురుద్దేశంతో బిల్లులు తేవడం చూస్తున్నాం. నిజంగా బీసీలను అభివృద్ధిపరిచే దిశగా ప్రభుత్వం పనిచేస్తే బీజేపీ దానికి అడ్డంకి కాదు. బీసీ వర్గాలకు తమ న్యాయహక్కులు చేకూరాలన్నదే మా ధ్యేయం అని ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా, బీసీల కోసం బీజేపీ పోరాటానికి సిద్ధంగా ఉందని, వారి సంక్షేమాన్ని ముందుండి నడిపించేందుకు పార్టీ కట్టుబడి ఉందని రామచందర్ రావు తెలియజేశారు.