Bhatti Budget 2024 : అభూత కల్పన తప్ప బడ్జెట్ లో ఏమిలేదు – కిషన్ రెడ్డి

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ కాంగ్రెస్‌ తుంగలో తొక్కిందని .. ప్రతి ఏడాది రైతులకు సీజన్‌ ముందు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయానికి బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు

  • Written By:
  • Publish Date - July 25, 2024 / 08:47 PM IST

అసెంబ్లీ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో గొప్పలు చెప్పుకోవడం , అభూత కల్పన, అంకెల గారడీ, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప ఏం లేదని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ వార్షిక బడ్జెట్ (Telangana Budget 2024 – 25) ను గురువారం అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ప్రవేశ పెట్టారు. మొత్తం రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ను శాసనసభలో ప్రవేశ పెట్టగా ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు. అలాగే పలు శాఖలకు నిధులు కేటాయిస్తున్నట్లు ఆ వివరాలు పేర్కొన్నారు. కాగా భట్టి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఫై ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ తమ స్పందనను తెలియజేయగా..తాజాగా బిజెపి నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ కాంగ్రెస్‌ తుంగలో తొక్కిందని .. ప్రతి ఏడాది రైతులకు సీజన్‌ ముందు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయానికి బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు మంత్రి కిషన్ రెడ్డి. బడ్జెట్‌ మొత్తంలో ఆసరా పెన్షన్ల ప్రస్తావనే లేదని , మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని.. కానీ బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తలేదని , దళిత సంక్షేమం కోసం కేటాయించాల్సిన బడ్జెట్ రూ.21,072 కోట్ల నుంచి రూ.7,638 కోట్లు తగ్గిపోయిందని, గిరిజన సంక్షేమం కోసం కేటాయించాల్సిన బడ్జెట్ రూ. 4,365 కోట్ల నుంచి రూ. 3,969 కోట్లకు తగ్గిపోయిందని పేర్కొన్నారు.

గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం కూడా అంతే నిజమనేదానికి ఈరోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ నిదర్శనమని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? .. 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? అని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క చదివింది ఆర్థిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా అని విమర్శించారు. అప్పులు ఉన్నందున హామీలు అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

Read Also : Asthma: ఆస్త‌మాతో బాధ‌ప‌డుతున్న స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఈ స‌మ‌స్య ల‌క్ష‌ణాలివే..!

Follow us