గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖమ్మం జిల్లాలోని కోణిజర్ల మండలం చిన్నగోపతి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బిఆర్ఎస్ (BRS) పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ పాలకులు ప్రజా సంక్షేమం పట్ల నిర్లక్ష్యం చూపారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తన ప్రభుత్వం కొత్తగా నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నామని, ఈ పధకాలు ప్రజలకు న్యాయం చేయడానికి మంచి ఆరంభమని అభిప్రాయపడ్డారు. ఈ పథకాల అమలుకు ప్రతి సంవత్సరం 45 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని, అయినప్పటికీ ప్రజల కోసం ఇవి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ప్రజల కోసం పనిచేయకపోవడం వల్లే తాము ఈ పథకాలను ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. భారత రాజ్యాంగం దేశానికి పునాది అని, ప్రజల హక్కులు, స్వేచ్ఛలకు అది ఆధారమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. టీఆర్‌ఎస్ నేతలు ప్రజా సంక్షేమాన్ని అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
Budget 2025 Expectations : ఉద్యోగులు, చిరువ్యాపారులు, ప్రొఫెషనల్స్.. కేంద్ర బడ్జెట్‌లో ఏమున్నాయ్ ?
రైతుల రుణమాఫీకి సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తావించిన భట్టి… ఇప్పటికే మూడు నెలల్లోనే 22 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేశామని చెప్పారు. అలాగే, మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్య, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధికి తమ ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. ప్రతి పాఠశాలను అత్యాధునికంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు సేవలే తమ ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేయడానికి కృషి చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. సీఎల్పీ నేతగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన వ్యక్తిగా.. ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రతి నిమిషం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం.. నిత్యం ప్రజలకు పనికి వచ్చే నిర్ణయాలే తీసుకుంటాం అని తెలిపారు.