తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి కీలక చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. చెన్నైలో జరిగిన విద్యా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో విద్యా రంగానికి రూ. 21,000 కోట్లు కేటాయించి, స్కిల్ యూనివర్సిటీ స్థాపనతో యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని సంకల్పించామని తెలిపారు. ప్రతిభావంతులైన టీచర్లను నియమించడానికి డీఎస్సీ నిర్వహించి, పాఠశాలల వసతులు మెరుగుపరిచామని గుర్తు చేసారు. తెలంగాణ విద్యార్థులను గ్లోబల్ స్థాయిలో పోటీకి సిద్ధం చేయడానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపు రూ. 200 కోట్లతో ప్రతి పాఠశాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలల్లో క్రీడా మైదానాలు, సీనిమా హాళ్లు, అత్యాధునిక ల్యాబ్‌లతో పాటు బెస్ట్ డైట్ సౌకర్యాలు అందించనున్నట్లు వివరించారు.
Maha Kumbh Mela 2025 : రేపు ఒక్క రోజే మహాకుంభ మేళాకు 10 కోట్ల మంది..!
స్కిల్ డెవలప్మెంట్ పై ప్రాధాన్యత
తెలంగాణ యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించామని, దీనికి ఆనంద్ మహీంద్రా లాంటి వ్యక్తిని చైర్మన్‌గా నియమించామని తెలిపారు. పాత ఐటీఐలను ఆధునిక సాంకేతికతతో అప్‌గ్రేడ్ చేయడం ద్వారా యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నామని వివరించారు.
విద్యా కమిషన్ ఏర్పాటు
ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూలుపై సమీక్ష చేయడానికి విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను పెంచి, విద్యార్థులకు మెరుగైన వసతులు అందించడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు.
పెట్టుబడులతో విద్యా వృద్ధి
విద్యలో పెట్టుబడులు రాష్ట్రానికి మానవ వనరుల రూపంలో సంపదను పెంచుతాయని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. గురుకుల విద్యా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తూ, విద్యా రంగానికి మరింత నిధులు కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
విధానపరమైన అంశాలపై పోరాటం
రాజ్యాంగంపై విశ్వాసంతో కేంద్రంతో బలమైన సంబంధాలు కోరుకుంటున్నామని, అయితే విధానపరమైన అంశాలపై పోరాటం కొనసాగుతుందని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టామని తెలిపారు. ఇల్లు, విద్య, ఉపాధి లభించని స్థితి రాష్ట్రంలో ఉండకూడదని ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.