Bharat Net : రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్!! దీన్ని తీసుకుంటే ఇంటర్నెట్ వస్తుంది. ఫోన్లు చేసుకోవచ్చు. కొన్ని తెలుగు ఓటీటీలను చూసి ఎంజాయ్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘భారత్ నెట్’ పథకం ద్వారా తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాలకు లబ్ధి జరగబోతోంది. భారత్ నెట్ పథకాన్ని తొలి విడతగా నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 94 మండలాల పరిధిలో ఉన్న 2,096 గ్రామ పంచాయతీల్లో అమలు చేయనున్నారు. దీన్ని సీఎం రేవంత్‌రెడ్డి రేపు (ఆదివారం) ప్రారంభిస్తారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పీవోసీ)లో భాగంగా తొలిదశలో మద్దూరు, సంగుపేట్, అడవి శ్రీరామ్‌పూర్ గ్రామాల్లో టీ ఫైబర్ ట్రయల్ సేవలకు ఆయన శ్రీకారం చుడతారు. రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం కేంద్ర సర్కారు రూ.2,500 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ‘టీ ఫైబర్’ సంస్థ గ్రామాల్లో ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ కనెక్షన్ అందిస్తుంది. ఇందుకోసం రూ.300 ఛార్జీని తీసుకుంటారని తెలుస్తోంది. రాష్ట్రంలోని లక్షలాది ఇళ్లకు దశలవారీగా ఈ సౌకర్యం కల్పిస్తారు.
Also Read :Car Accident : చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు యువకుల మృతి
భారత్ నెట్ (Bharat Net) కనెక్షన్ తీసుకున్న వారికి 20 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ లభిస్తుంది. గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లకు కూడా భారత్ నెట్ కనెక్షన్ ఇస్తారు. గ్రామాల్లోని జంక్షన్లు, ఇతర చోట్ల కూడా అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి ఫైబర్‌నెట్‌తో అనుసంధానం చేస్తారు. ఆయా సీసీ కెమెరాలు సంబంధిత పోలీసు స్టేషన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు లింక్ అవుతాయి. భారత్ నెట్ ప్రాజెక్టు తొలిదశలో 30వేల ప్రభుత్వ సంస్థలను అనుసంధానించాలని యోచిస్తున్నారు.