Bathukamma sarees : బతుకమ్మ పండుగ సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం చీరల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. గత విధానానికి భిన్నంగా కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఈసారి ‘అక్కా-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో కేవలం స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) సభ్యులకు మాత్రమే చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా, ఒక్కో సభ్యురాలికి ఒకటి చొప్పున కాకుండా రెండేసి చేనేత చీరలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Jaipur : జైపూర్‌లోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి పోలీసు బృందాలు
రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు..
ఈ నెల 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో ఆధార్ కార్డు ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఒక చీరను బహుమతిగా ఇచ్చేవారు. అయితే, రేవంత్ రెడ్డి సర్కార్ ఆ పద్ధతిని మార్చేసి, కేవలం డ్వాక్రా సంఘాల్లో క్రియాశీలకంగా ఉన్న మహిళలకే ఈ కానుకను పరిమితం చేసింది. దీనికోసం పట్టణ ప్రాంతాల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఓ ద్వారా అర్హులైన సభ్యుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
చేనేత సహకార సంఘాలకు బాధ్యతలు..
చీరల సేకరణ బాధ్యతను చేనేత సహకార సంఘాలకు అప్పగించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోనే సుమారు 9 లక్షలకు పైగా చీరలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15వ తేదీ నాటికి చీరలు జిల్లాలకు చేరుకునేలా కసరత్తు చేస్తున్నారు. అయితే, పండుగకు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండటంతో ఇంత పెద్దమొత్తంలో చీరలను సకాలంలో పంపిణీ చేయడం అధికారులకు సవాలుగా మారింది.
ప్రధాన మార్పులు ఇవే:
లబ్ధిదారులు: గతంలో ఆధార్ కార్డు ఉన్న 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు ఒక చీరను ఇచ్చేవారు. ఇప్పుడు, కేవలం డ్వాక్రా సంఘాల్లో క్రియాశీలకంగా ఉన్న మహిళలకే ఈ కానుకను అందిస్తారు.
చీరల సంఖ్య: ఒక్కో లబ్ధిదారురాలికి ఒక చీర కాకుండా, రెండు చేనేత చీరలను అందించనున్నారు.
పథకం పేరు: ఈ పంపిణీ కార్యక్రమం ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద జరుగుతుంది.
గతంలో బతుకమ్మ చీరల నాణ్యతపై విమర్శలు వచ్చాయి. నాసిరకం చీరలు పంపిణీ చేశారని ఆరోపణలు రావడంతో కొన్ని చోట్ల మహిళలు నిరసనలు, దహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈసారి అలాంటి విమర్శలకు తావులేకుండా నాణ్యమైన చేనేత చీరలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Uttarakhand : నకిలీ బాబాలపై ఉక్కుపాదం..‘ఆపరేషన్ కాలనేమి’తో 14 మంది అరెస్టు