Bandi Sanjay: ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే విధానం బీజేపీలో ఉండడంతో బీజేపీ అధ్యక్షుడిగా వేరొకరిని నియమిస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు అధ్యక్ష పదవి కోసం అధిష్టానం పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. అధిష్టానంతో మంతనాలు జరిపిన వారిలో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నట్లు సమాచారం. కానీ వీరిలో ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావులకు పాత కొత్త ఈక్వేషన్లు అడ్డంకిగా మారాయి.
వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి అధ్యక్ష పగ్గాలు ఇవ్వొద్దని మొదటినుంచి బీజేపీ కోసం పనిచేసిన వారికే రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలని తెలంగాణ బీజేపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. కానీ ఈటల రాజేందర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాత, కొత్త కాకుండా రాజకీయ అనుభవం, మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని అనుచర వర్గంతో చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ అధిష్టానం నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మళ్లీ పాత అధ్యక్షుడికే తెలంగాణ బీజేపీ పగ్గాలు కట్టబెడతారంటూ బండి సంజయ్ (Bandi Sanjay) పేరు తెరమీదకు మీదకు వస్తుంది. అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు పైకి విముఖంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా అనుచర వర్గం వద్ద సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా కీలకంగా వ్యవహరించారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి బండి సంజయ్ పార్టీని బలోపేతం చేశారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రను ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రశంసించారు. ఢిల్లీలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో బండి సంజయ్‌ను ప్రశంసించారు. అందరూ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నమూనాగా తీసుకొని పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు చేపట్టాలంటూ పార్టీ నేతలకు మోదీ సూచించారు. ఆ ప్రజా యాత్ర కొంతమేరైనా తెలంగాణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు కారణమంటూ రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరిగింది.
Also Read: Vangaveeti Radha: ఫ్యూచర్ ప్లాన్.. వంగవీటి రాధ నిర్ణయం అదేనా ?
బండి సంజయ్ తెలంగాణ అధ్యక్ష పగ్గాలు చేపట్టడం ఆ తర్వాత ప్రజా సంగ్రామ యాత్ర చేసిన తర్వాత పూర్తిగా తెలంగాణలో బీజేపీ పరిస్థితి మారిందంటూ ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర చర్చ జరిగింది. తెలంగాణలో బీజేపీ పరిస్థితి బిఫోర్ బండి సంజయ్.. ఆఫ్టర్ బండి సంజయ్ అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరిగింది. ఆ విధంగా పార్టీ బలోపేతానికి బండి సంజయ్ పని చేశారని నేతలు చెప్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల బీజేపీ అధ్యక్ష మార్పు గతంలో అనివార్యమైంది. మళ్లీ ఇప్పుడు బండి సంజయ్‌కే అధ్యక్ష పగ్గాలు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ పేరును ఎప్పటిలోగా అధికారికంగా ప్రకటిస్తారని బండి సంజయ్ అనుచర వర్గం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది.
ఒకవేళ బండి సంజయ్‌కు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే మరి ఈటెల రాజేందర్ పరిస్థితి ఏంటి అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఒకవేళ బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ రథసారధిగా నియమిస్తే ఈటెల రాజేందర్ ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారంటూ ప్రచారం జరుగుతుంది. అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్ ను బీజేపీ అధిష్టానం ఏ విధంగా సంతృప్తిపరుస్తుంది. అసలు అధిష్టానం మదిలో ఏముంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.