Alai Balai Program : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కుల గణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చాలా దుర్మార్గమైనదని మండిపడ్డారు. స్థానిక ఎన్నికలను తప్పించుకునే ధోరణిలో ప్రభుత్వం ఉందంటూ దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేశారు.. అది ఏమైంది?. మళ్లీ గణన ఎందుకు..? ఆ రిపోర్ట్ వాళ్లు బయట పెట్టలేదు. ఈ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి..?” అంటూ బండి సంజయ్ నిలదీశారు. ”కుల గణన సర్వే ఫేక్. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించి తప్పించుకునే ధోరణిలో ప్రభుత్వం ఉంది. రూ.150 కోట్ల రూపాయలతో కుల గణన సర్వే అంటూ ప్రభుత్వం డైవర్షన్ చేస్తోంది. ఆనాటి సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు బయటపెట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏంటి..?” అని బండి సంజయ్ ప్రశ్నలు గుప్పించారు.
Read Also: Mumbai : పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్..పశ్చిమ రైల్వే సేవలకు అంతరాయం
మరోవైపు అలయ్ బలయ్ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా.. కుల మతాలకు అతీతంగా జరిపే ఈ అలయ్ బలయ్ కార్యక్రమం రాష్ట్రంలోనే గాక దేశంలోనే ఆకర్షణ పొందిన కార్యక్రమమని అన్నారు. దసరా తర్వాత అందరినీ కలుసుకుని శుభాకాంక్షలు తెలిపే అవకాశాన్ని దత్తాత్రేయ గత 18 ఏళ్లుగా కల్పిస్తున్నారని తెలిపారు. ఎన్నికల వరకే పార్టీలు ఉండాలని ఎన్నికల తర్వాత మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు, మన సాంప్రదాయాలను కాపాడుకునేందుకు అందరూ కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దత్తాత్రేయతో 1980 నుంచి స్నేహం ఉందని.. కిషన్ రెడ్డితో 1990 నుంచి పరిచయం ఉందని మిత్రుత్వంతో పార్టీలు.. అడ్డు రావన్నారు.