CM Revanth Reaction: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్ ఇదే!

అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళన చేసిన ఓయూ జేఏసీ నేతలను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.

Published By: HashtagU Telugu Desk
CM Revanth Reaction

CM Revanth Reaction

CM Revanth Reaction: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నాయ‌కులు దాడి చేసింది. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో మృతిచెందిన రేవ‌తి కుటుంబాన్ని అల్లు అర్జున్ ఆదుకోవాల‌ని డిమాండ్ చేస్తూ ఇంటిని ముట్ట‌డించారు. ముట్ట‌డించ‌డ‌మే కాకుండా ఇంటిపై రాళ్ల‌తో, ట‌మాటాల‌తో దాడి చేశారు. దీంతో బ‌న్నీ మామ రంగంలోకి దిగి అల్లు అర్హ‌, అల్లు ఆయాన్‌ను త‌న ఇంటికి తీసుకెళ్లారు.

దాడి చేసిన నేత‌లు అరెస్ట్‌

అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళన చేసిన ఓయూ జేఏసీ నేతలను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. రేపు నాంపల్లి కోర్టులో వీరిని హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈరోజు వీరు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు రువ్వి, ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.

Also Read: Jago Grahak Jago App : డిజిటల్ మార్కెట్‌లో వినియోగదారుల రక్షణ కోసం 3 ప్రభుత్వ యాప్‌లు

సీఎం రేవంత్ స్పంద‌న‌

అల్లు అర్జున్ ఇంటిపై దాడిని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reaction) ఖండించారు. సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయ‌న ట్వీట్ చేశారు.

ఏసీపీపై క్రమశిక్షణ చర్యలు

సంధ్య థియేటర్ వ్యవహారంపై ప్రెస్‌ మీట్ పెట్టిన ఏసీపీ విష్ణుమూర్తిపై ఉన్నతాధికారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడంపై సీరియస్ అవుతున్నారు. అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నారు. గతంలో విష్ణుమూర్తి నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తూ సస్పెండ్ అయ్యారు. అవతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సస్పెన్షన్‌కి గురయ్యారు.

సంయమనం పాటించాలి: అల్లు అరవింద్‌

తమ ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో తొందరపడి ఎవరూ ఎలాంటి చర్యలకు దిగవద్దని అల్లు అరవింద్ కోరారు. తమ ఇంటి ముందు విద్యార్థి సంఘాల నేతలు నిరసన చేయడంపై స్పందిస్తూ.. ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదన్నారు. అందరూ సంయమనం పాటించాలని సూచించారు. విద్యార్థి సంఘాల నేతల ఆందోళనకు సమయంలో కొందరు ఇంటిపై రాళ్లు రువ్వారు. అక్కడి పూల కుండీలను ధ్వంసం చేశారు.

  Last Updated: 22 Dec 2024, 10:52 PM IST