BRS Party : భారత రాష్ట్ర సమితి (BRS) పేరును తెలంగాణ రాష్ట్ర సమితి(TRS)గా మార్చబోతున్నారా ? వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ఈనెల 27న(ఆదివారం) జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో దీనిపై ప్రకటన చేస్తారా ? అనే కోణంలో ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పార్టీ పేరు మార్పుపై జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా ఉన్నాయి. ఇంతకీ అవేమిటో చూద్దాం..
కుండబద్దలు కొట్టేలా చెప్పేసిన కేటీఆర్
‘‘బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదు. మాది ఒక ప్రాంతీయ పార్టీ’’ అని ఇటీవలే కేటీఆర్(BRS Party) స్పష్టం చేశారు. దీంతో పార్టీకి పెట్టిన బీఆర్ఎస్ అనే పేరును కొనసాగిస్తారా ? లేదా ? అనే దానిపై డైలమా ఏర్పడింది. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనే బలమైన సంకల్పంతో కేసీఆర్ తన పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చారు.ఈ విధంగా పేరును మార్చడంలో కేసీఆర్ కుమార్తె కవిత కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఈ విధంగా పార్టీ పేరు మార్పును మొదటి నుంచే వ్యతిరేకిస్తున్న కేటీఆర్.. ఇప్పుడు బహిరంగంగా బయటపడ్డారు. తమది ప్రాంతీయ పార్టీయే అని కుండబద్దలు కొట్టేలా చెప్పేశారు.
Also Read :Pak Missile Tests: భయపడ్డ పాక్.. నేడు, రేపు కరాచీలో క్షిపణి పరీక్షలు
ఫుల్ క్లారిటీతో కేటీఆర్
రాబోయే రోజుల్లో కేంద్రంలో సొంత బలంతో ఏ జాతీయ పార్టీ కూడా అధికారంలోకి రాలేదని కేటీఆర్ అంటున్నారు. బీఆర్ఎస్‌తో పాటు దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీలన్నీ తిరిగి అధికారంలోకి వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఈ మాటలను బట్టి ప్రాంతీయ పార్టీగానే బీఆర్ఎస్‌కు భవిష్యత్తు ఉంటుందని కేటీఆర్ చెప్పకనే చెప్పారు. జాతీయ రాజకీయాల ఆలోచనను వదిలేసి, ప్రాంతీయవాదాన్ని భుజానికి ఎత్తుకుంటేనే బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ ఉంటుందని కేటీఆర్ భావిస్తున్నారు. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా కేటీఆర్ వాదనతో ఏకీభవిస్తున్నారు. జాతీయ రాజకీయ పార్టీగా ఎదగాలంటే దీర్ఘకాలిక వ్యూహం అవసరం. కనీసం ఏదైనా ఒక రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతుంటే.. ఇతర రాష్ట్రాల్లోకి పార్టీని విస్తరించడం ఈజీ అవుతుంది. ఉన్న అధికారాన్ని కూడా కోల్పోయి.. ఇతర రాష్ట్రాలకు పార్టీని విస్తరించడం అనేది అంత సులభం కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను టీఆర్ఎస్ పేరుతోనే నిర్వహించాలని కొందరు నాయకులు కేసీఆర్‌ను కోరారట.గతంలో ఒకానొక సమయంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ అయితే.. పార్టీ పేరు మార్పుపై చర్చ జరుగుతోందని వెల్లడించారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పేరును ఇతరులకు కేటాయించకుండా ఆరేళ్ల పాటు ఫ్రీజ్ చేసింది.