తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కేబినెట్ విస్తరణ (Cabinet Expansion) ఫైనల్ కు వచ్చేసింది. ఇప్పటికే పలుమార్లు మారిన ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, కాంగ్రెస్ అధిష్టానం ముగ్గురు కొత్త ఎమ్మెల్యేలను మంత్రులుగా ఎంపిక చేసింది. ఈ ముగ్గురిలో ఇద్దరు దళిత సామాజికవర్గాలకు చెందినవారు కాగా, ఒకరు బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడం విశేషం. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ (మాల), మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (మాదిగ), మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి (బీసీ – ముదిరాజ్)లకు మంత్రి పదవులు కేటాయించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సామజిక సమీకరణాల దృష్టిలో పెట్టుకొని ఈ లిస్ట్ ఫైనల్ చేసినట్లు సమాచారం.
MLC Kavitha: ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు పార్టీ అధిష్టానం ఈ జాగ్రత్తలు తీసుకుంది. దళితులకు, బీసీలకు రాజకీయ అవకాశాలను సమానంగా ఇవ్వాలనే ఉద్దేశంతో నూతన మంత్రుల ఎంపిక జరిగింది. చెన్నూరు, మానకొండూరు, మక్తల్ నియోజకవర్గాల నాయకులకు ఈ అవకాశాల ద్వారా ఆ ప్రాంతాలకు కూడ రాజకీయం లో మరింత ప్రాధాన్యం లభించనుంది. కేబినెట్‌లోకి చేరనున్న వారికి ఎలాంటి శాఖలు కేటాయిస్తారన్న విషయమై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. ఇదిలా ఉండగా.. మంత్రివర్గంలో చోటు లభించాలన్న ఆశలు పెట్టుకున్న కొందరు సీనియర్ నాయకులకు ఈ పరిణామాలు నిరాశ కలిగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కలసి అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేసే అవకాశముంది. ఆదివారం మధ్యాహ్నం ఈ కేబినెట్ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడనుంది.