Site icon HashtagU Telugu

Telangana Leaders : తెలంగాణలో నాయకులంతా ఆ పార్టీ నీడలేనా..?

Are All The Leaders In Telangana Shadows Of That Party..

Are All The Leaders In Telangana Shadows Of That Party..

By: డా. ప్రసాదమూర్తి

Telangana Leaders : రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. ఎన్నికలు సమీపిస్తున్న కాలంలో ఇది ఎంత సహజమైన విషయమో ఇంకా ఇంకా స్పష్టంగా మనకు విదితమవుతుంది. కానీ ఒక్కోసారి ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న రాజకీయ నాయకుల తీరుతెన్నులు చూస్తే ఎవరి ఉద్దేశం ఏమిటో అర్థం కాక మనమంతా గందరగోళ పడిపోతాం. ఎవరు ఎవరిమీద ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు.. ఆ ఆరోపణలలో నిజమెంత.. ఆ ఆరోపణలు చేస్తున్నవారు నిజనిర్ధారణ చేసి తమ నిజాయితీని నిరూపించుకుంటారా.. తాము చేస్తున్న ఆరోపణలు వెనక సత్యం ఎంత ఉందో ఆధారాలతో సహా ప్రజల ముందుకు వస్తారా.. ఇలాంటి సందేహాలు ఎవరికి కలిగినా, ఇలాంటి ప్రశ్నలు ఎవరు వేసినా వాటికి అర్థం ఉండదు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యర్ధుల మీద ఆరోపణలు చేసుకోవడమే గాని వాటిని నిరూపించుకునే బాధ్యత నాయకులు తీసుకోరు.

తెలంగాణలో (Telangana) అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో లోపాయికారి ఒప్పందం పెట్టుకొని పైకి ఒకరినొకరు తిట్టుకుంటున్నట్టు నటిస్తున్నారని కాంగ్రెస్ వారు ఆరోపిస్తున్నారు. అంటే బిజెపి, బీఆర్ఎస్ పేర్లలో, రూపంలో మార్పేగాని ఆత్మలో ఒకటేనని కాంగ్రెస్ వారి ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పదేపదే ఈ ఆరోపణ చేస్తుంటారు. మరి ఈ ఆరోపణ ఎన్నికల కాలంలో ప్రజలు నమ్మితే, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ముస్లిం సముదాయం నమ్మితే, బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ. దీన్ని ఎలా తిప్పి కొట్టాలి అనేది పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ, బిజెపి ఒకటే అని చెప్పడానికి బీఆర్ఎస్ సాహసించలేదు. కారణం కాంగ్రెస్, బిజెపి చరిత్ర పొడవున బద్ధ శత్రువులుగానే కొనసాగారు. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు గాలికి వదిలేస్తే అవి చేయాల్సిన పని అవి చేసుకుపోతాయి.

We’re now on WhatsApp. Click to Join.

అందుకే కేటీఆర్ ఒక కొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు. తమలపాకుతో నువ్వు రెండంటే అరిటాకుతో నేను మూడంటాను అని సామెత చెప్పినట్టు, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణను ఆయన మీదకే ఎక్కుపెట్టి కేటీఆర్ ఒక కొత్త ఆరోపణ చేశారు. అదేమిటంటే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని, ఎన్నికలు పూర్తయ్యాక ఆయన తన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని కాషాయ దళంలో కలిసిపోతారని కేటీఆర్ ఒక విచిత్రమైన ఆరోపణ చేశారు. ఇక ఈ ఆరోపణను ఎంఐఎం నాయకులు గట్టిగా పట్టుకున్నారు. వారికెందుకు మధ్యలో అంటే కారణం మనకు తెలుసు కదా. ఎంఐఎం, బీఆర్ఎస్ తో బహిరంగంగానే పొత్తులో ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ముస్లిం సముదాయం విశ్వసిస్తే వాళ్లు బీఆర్ఎస్ కి ఎదురు తిరిగితే, బీఆర్ఎస్ తో పొత్తులో ఉన్న ఎంఐఎంకి కూడా అది వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డిని ఇరికించే పనిలో కేటీఆర్ తో పాటు ఎంఐఎం నాయకులు కూడా పడ్డారు.

రేవంత్ రెడ్డి పై కేటీఆర్ చేసిన ఆరోపణలో నిజం లేదని రేవంత్ నిరూపించుకోవాలని, భాగ్యలక్ష్మి దేవాలయానికి వచ్చి అక్కడ ప్రమాణం చేసి ప్రజల ముందు తనకూ ఆర్ఎస్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలని ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ సవాలు విసిరారు తాజాగా. చూశారా ఎంఐఎం నాయకులు కూడా బిజెపికి బీ-టీమ్ అని విమర్శలు ఎదుర్కొంటున్నారన్న విషయం మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణలో (Telangana) ఎంఐఎం వారు కేవలం హైదరాబాదులో మాత్రమే పోటీ చేస్తారు. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా పోటీ చేయరు. ఎందుకంటే అలా పోటీ చేస్తే తాము పొత్తుతో ఉన్న బీఆర్ఎస్ కు నష్టం. ముస్లింలు తమకు ఓటు వేస్తే అది బీఆర్ఎస్ కు ఏమాత్రమయినా నష్టం చేసే అవకాశం ఉంటుంది. అందుకని అలా ఎంఐఎం నాయకులు ఇక్కడ పోటీ చేయరు. కానీ దేశంలో మాత్రం అనేకచోట్ల పోటీ చేస్తారు.

అలా పోటీ చేయడం వల్ల బిజెపికి వ్యతిరేకంగా ఏకమయ్యే ముస్లిం ఓట్లు ప్రతిపక్షాలకు తర్జుమా కాకుండా, వాటిని ఎంఐఎం కైవసం చేసుకుని కొద్దో గొప్పో బిజెపి వ్యతిరేక ఓట్లు చీల్చి బిజెపికి ప్రయోజనం చేకూర్చే పనిని చేస్తున్నట్టు ఎంఐఎం విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో అసలు ఎవరు బిజెపితో ఏ విధంగా అంట కాగుతున్నారు అనే విషయంపై ప్రజలు గందరగోళంలో పడిపోతున్నారు. బిజెపికి అనుకూలంగా బిఆరెస్, బిజెపికి అనుకూలంగా ఎంఐఎం వ్యవహరిస్తున్నాయన్న విమర్శలున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ముద్ర వేయడానికి ఇటు బీఆర్ఎస్ నాయకులు, అటు ఎంఐఎం నాయకులు కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నారు.

చూశారా.. రాజకీయం ఎంత చిత్రంగా ఉంటుందో! ఇప్పుడు తెలంగాణలో బిజెపి మినహా మూడు ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం- ఈ మూడూ ఒకరిని ఒకరు పోటా పోటీగా నువ్వు బిజెపి మనిషివంటే.. నువ్వు బిజెపి మనిషివని ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మరి ప్రజల సంగతి ఏం కావాలి? ఎవరు ఎవరి పక్షాన ఏ రూపంలో పనిచేస్తున్నారు.. ఎవరి మాటల్లో ఎవరి ప్రయోజనాలు ఏ విధంగా నెరవేరుతున్నాయి.. అంతా ప్రజలకు గందరగోళంగా ఉంది. అసలు ఇలాంటి గందరగోళాన్ని సృష్టించి ప్రజల్ని అయోమయంలో పడేసి నయానో భయానో తమ వైపు తిప్పుకోవడమే రాజకీయ పార్టీల మహారాజకీయం. తెలంగాణలో ఇప్పుడు ఈ ఆరోపణల ప్రత్యారోపణల పర్వం సాగుతోంది. ఏది ఏమైనా దీనిలో ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణలో బిజెపితో ఫలానా వారు పరోక్షంగా పొత్తులో ఉన్నారని చెప్పడం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. అంటే తెలంగాణలో బిజెపి పరిస్థితి ఎంత ఒంటరిదయిందో మనకు అర్థమవుతోంది.

Also Read:  Pawan Kalyan – Junior Ntr : జూనియర్ ఎన్టీఆర్ పై జనసేనాని పరోక్ష కామెంట్స్.. నెట్టింట చర్చ