Good News For Farmers: తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా శుభవార్త (Good News For Farmers) అందించింది. ఖరీఫ్ 2025 సీజన్ కోసం రూ. 9,000 కోట్ల నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జూన్ 16 నుంచి ప్రారంభమైంది. ఈ పథకం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు స్థానంలో వచ్చింది. రైతు భరోసా కింద ఎకరాకు సీజన్‌కు రూ. 6,000, సంవత్సరానికి రూ. 12,000 ఆర్థిక సాయం అందజేస్తుంది. భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా అన్ని రైతులకు ఈ సాయం అందుతుంది.
మొదటి రోజైన జూన్ 16న, రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 41.25 లక్షల రైతుల ఖాతాల్లోకి 39.16 లక్షల ఎకరాలకు గాను రూ. 2,349.83 కోట్లు జమ చేయబడ్డాయి. మొత్తం 70.12 లక్షల రైతులు, 1.49 కోట్ల ఎకరాలకు తొమ్మిది రోజుల్లో, అంటే జూన్ 25లోగా నిధులు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత 18 నెలల్లో రైతుల కోసం రూ. 1 లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, బీమా పథకాలతో రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది.
Also Read: 5 Wickets In 5 Balls: టీ20 క్రికెట్‌లో సంచలనం.. 5 బంతుల్లో 5 వికెట్లు, వీడియో వైరల్!
కామారెడ్డి జిల్లాలో 2.82 లక్షల మంది రైతులు, తొమ్మిది లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా, వీరికి రూ. 264.63 కోట్లు అందనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 2.78 లక్షల మంది రైతులకు రూ. 274.10 కోట్లు జమ కానున్నాయి. ఈ పథకం కింద కౌలు రైతులు, కూలీలకు కూడా సాయం అందుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టిన రుణ భారం ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ పథకం అందరినీ ఆకట్టుకుందని, గతంలో ఉన్న ఎకరాల పరిమితిని తొలగించామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ చర్య రైతుల విశ్వాసం పెంచనుంది. నిధులు జమ కాకపోతే, రైతులు స్థానిక తహసీల్దార్ లేద వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు.