తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రజాకవి, గాయకుడు అందెశ్రీ ఇక లేరు. నిన్న గుండెపోటుతో కన్నుమూసిన ఆయనకు ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఘట్కేసర్‌లోని NFC నగర్లో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై, కవికి తుది నివాళులు అర్పించారు. ఆయన పార్థివ దేహంపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు పెద్ద సంఖ్యలో కళాకారులు, ప్రజా సంఘాలు పాల్గొని తమ ప్రియమైన కవికి కన్నీటి వీడ్కోలు పలికారు.
Grain Purchases : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి – ఉత్తమ్ కుమార్
అంతిమయాత్ర సందర్భంగా లాల్పేట నుంచి ఘట్కేసర్ వరకు వేలాది మంది అభిమానులు, విద్యార్థులు, సాంస్కృతిక కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. “జయజయహే తెలంగాణా” పాటను నినదిస్తూ ఆయనను స్మరించారు. ప్రజా పోరాటాల్లో అందెశ్రీ పాటలే ఉత్సాహాన్ని నింపినవని పలువురు నేతలు పేర్కొన్నారు. ఆయన సాహిత్యం తెలంగాణ ఆత్మకు ప్రతీకగా నిలిచిందని, ఆయన కవిత్వం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. చివరి యాత్రలో చోటుచేసుకున్న భావోద్వేగ దృశ్యాలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి.
ప్రజాకవి అందెశ్రీ మరణం తెలంగాణకు అపార నష్టం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన పేరు స్మరణార్థంగా “అందెశ్రీ స్మృతివనం” ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ఆయన రాసిన “జయజయహే తెలంగాణా” గీతాన్ని రాష్ట్ర పాఠ్య పుస్తకాలలో చేర్చనున్నట్లు వెల్లడించారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు అన్ని విధాలా ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా హక్కుల కోసం పాట పాడిన ఆ కవి ఇక లేరు కానీ, ఆయన స్వరం తెలంగాణ నేలపై ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుందనే భావనతో రాష్ట్రం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
