Site icon HashtagU Telugu

Amit Shah Sketch: `షా` స్కెచ్! టీఆర్ఎస్ పై ఆప‌రేష‌న్ `ఎల్లో`!!

Amit

Amit

అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డం రాజ‌కీయ‌వేత్త‌ల‌కు వెన్న‌తోపెట్టిన విద్య‌. ప్ర‌త్యేకించి మోడీ, అమిత్ షా ద్వ‌యం ఆ విష‌యంలో నిష్ణాతులు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం కోసం అన్ని ర‌కాల శ‌క్తుల‌ను కూడ‌గ‌డుతున్నారు. ఆ క్ర‌మంలో టీడీపీ చీఫ్ చంద్ర‌బాబును వాడుకోవ‌డానికి మాస్ట‌ర్ స్కెచ్ వేశారని తెలుస్తోంది. చంద్ర‌బాబు భుజంమీద తుపాకీ పెట్టి కేసీఆర్ కోట‌కు మోడీ, షా ద్వ‌యం గురి పెట్టింద‌ని వినికిడి. అందుకే, టీడీపీని ద‌గ్గ‌ర‌కు తీసుకుంటూ బీజేపీ వేసిన స్కెచ్ ప‌నిచేస్తోంది.

టీఆర్ఎస్ పార్టీ మూలాల‌ను పెక‌లించ‌డానికి బీజేపీ మాస్టార్ ప్లాన్ వేసింది. ఆ పార్టీ బ‌లబ‌ల‌హీన‌త‌ల‌పై అధ్య‌య‌నం చేసింది. పూర్వ‌పు తెలుగుదేశం పార్టీ క్యాడ‌ర్‌, లీడ‌ర్లు టీఆర్ఎస్ పార్టీకి బ‌ల‌మ‌ని తెలుసుకుంది. ఆ పార్టీ 90శాతం టీడీపీ లీడ‌ర్ల‌తో నిండిపోయింది. ఎక్క‌డ తెలుగుదేశం పార్టీ లీడ‌ర్లు దూరంగా ఉన్నారో, అక్క‌డ టీఆర్ఎస్ బ‌ల‌హీనంగా ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు ఖ‌మ్మం జిల్లాను తీసుకోవచ్చు. అక్క‌డ నామా నాగేశ్వ‌ర‌రావు వెళ్లే వ‌ర‌కు టీఆర్ఎస్ పార్టీ ఉనికి దాదాపుగా లేదు. ఇక‌, న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల్లోనూ పూర్వ‌పు తెలుగుదేశం పార్టీ లీడ‌ర్లు ఉన్న చోట టీఆర్ఎస్ బ‌లంగా ఉంది. స‌రిగ్గా ఇదే పాయింట్ ను బీజేపీ ప‌ట్టుకుందట‌. ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ పార్టీలో కొన‌సాగిన పూర్వ‌పు టీడీపీ లీడ‌ర్ల‌పై ఆప‌రేష‌న్ చేయ‌డానికి చంద్ర‌బాబు నాయుడ్ని ఉప‌యోగించాల‌ని మోడీ, షా ద్వ‌యం ప్లాన్ చేస్తుంద‌ట‌.

Also Read:  AP housing Scheme: పనులు వేగవంతం చేయండి… గృహనిర్మాణ శాఖ సమీక్షలో సీఎం జగన్‌

ఉమ్మ‌డి ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌ను తీసుకుంటే, తెలంగాణ‌లో టీడీపీ చాలా బ‌లంగా ఉండేది. ప్ర‌త్యేక వాదాన్ని కేసీఆర్ వినిపించిన తొలి రోజుల్లోనూ టీడీపీ ఏ మాత్రం బ‌ల‌హీన‌ప‌డ‌లేదు. రాష్ట్రం విడిపోయిన త‌రువాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లోనూ బీజేపీ, టీడీపీ సంయుక్తంగా 19 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకున్నాయి. ఆనాడు వాస్తవంగా చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్ట‌లేదు. ఏపీ మీద ఆయ‌న పూర్తిగా స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు. ఫ‌లితంగా టీఆర్ఎస్ పార్టీ 63 మంది ఎమ్మెల్యేల‌తో మైనార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ త‌రువాత ప్ర‌త్య‌ర్థి పార్టీల ఎమ్మెల్యేల‌ను అధికారాన్ని ఉప‌యోగించి కేసీఆర్ లాగేసుకున్నారు. వాస్త‌వంగా టీఆర్ఎస్ పార్టీ 2014 వ‌ర‌కు కూడా పెద్ద‌గా బ‌లంగా లేద‌ని ఆ ఎన్నిక‌ల ఫ‌లితాలు చెబుతున్నాయి.

టీఆర్ఎస్ పార్టీని 2001లో కేసీఆర్ పెట్టిన త‌రువాత 2004, 2009, 2014, 2018(ముంద‌స్తు), 2019 సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రిగాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌కు 2016 వ‌ర‌కు దూరంగా టీఆర్ఎస్ ఉంది. 2004 సాధార‌ణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని నామ‌మాత్రంగా ఎమ్మెల్యేల‌ను సంపాదించుకుంది. ఆ త‌రువాత జ‌రిగిన 2009 ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్ట్ లు, టీడీపీ , టీఆర్ఎస్ మ‌హాకూట‌మిగా వెళ్ల‌డంతో సుమారు 10 మంది ఎమ్మెల్యేల‌ను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. 2009 పొత్తు త‌రువాత పూర్వ‌పు ప‌రిచ‌యాల‌తో టీడీపీ సీనియ‌ర్ల‌పై కేసీఆర్ ఆప‌రేష‌న్ చేశారు. కొంత మేర‌కు స‌ఫ‌లీకృతం అయ్యారు. ఫ‌లితంగా 2014 ఎన్నిక‌ల్లో 63 మంది ఎమ్మెల్యేల‌ను టీఆర్ఎస్ గెలుచుకుంది.

Also Read: NTR Needs More Time? ఎన్టీఆర్.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ!

ఆ త‌రువాత టీడీపీ పార్టీని ఖాళీ చేయ‌డానికి సామ‌ దాన‌ దండోపాయాల‌ను కేసీఆర్ ఉప‌యోగించారు. ఆ పార్టీ గెలుచుకున్న 15 మంది ఎమ్మెల్యేల్లో 13 మందిని టీఆర్ఎస్ వైపు తిప్పుకున్నారు. బంగారు తెలంగాణ అనే సెంటిమెంట్ ను రంగ‌రించ‌డం, టీడీపీలోని బ‌ల‌మైన లీడ‌ర్ల‌పై ఆప‌రేష‌న్ కార‌ణంగా 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కేసీఆర్ 83 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకోగ‌లిగారు. ఆనాడు కేంద్రంలోని బీజేపీ కూడా ప‌రోక్షంగా కేసీఆర్ కు మ‌ద్ధ‌తు ఇచ్చింద‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. అంటే, టీడీపీ పూర్వ‌పు లీడ‌ర్లు, బీజేపీ మ‌ద్ధ‌తు లేకుండా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అధికారంలోకి రాలేద‌ని అర్థం అవుతుంది. స‌రిగ్గా ఇదే పాయింట్ మీద‌ బీజేపీ క‌స‌ర‌త్తు చేస్తోంది. పూర్వ‌పు టీడీపీ లీడ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి చంద్ర‌బాబును న‌మ్ముకుంది. అందుకే, ఆయ‌న‌తో పొత్తుకు మ‌రోసారి బీజేపీ సిద్ధం అవుతుంద‌ని తెలుస్తోంది.

ఈనెల 7వ తేదీన రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్లో మోడీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే `ఆజాదీకా అమృత మ‌హోత్స‌వ్` కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబుకు ప్ర‌త్యేక ఆహ్వానం వ‌చ్చింది. ఇటీవ‌ల‌ రాష్ట్ర‌ప‌తి ముర్ముకు టీడీపీ ఎమ్మెల్యేల ఓటు అవ‌స‌రం లేక‌పోయిన‌ప్ప‌టికీ షా ఆదేశంతో ముర్ము టీడీపీ మ‌ద్ధ‌తు కోసం విజ‌యవాడ‌లో స‌మావేశం అయ్యారు. అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌మం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఫోన్ ద్వారా బాబుతో సంప్ర‌దింపులు జ‌రిపారు. ఇవ‌న్నీ బీజేపీ, టీడీపీ ద‌గ్గ‌ర‌వుతున్నాయ‌ని చెప్ప‌డానికి సంకేతాలు. ఏపీలో ఉనికి , తెలంగాణ‌లో అధికారం కోసం చంద్ర‌బాబు అండ అవ‌స‌ర‌మ‌న్న నిర్ణ‌యానికి షా వ‌చ్చేశార‌ట‌. పైగా తెలంగాణ వ్యాప్తంగా టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకు మీద చేసిన స‌ర్వే కూడా బాబు అవ‌స‌రాన్ని తేల్చింద‌ట‌. అందుకే, చంద్ర‌బాబు భుజం మీద తుపాకి పెట్టి కేసీఆర్ సామ్రాజ్యాన్ని కూల్చేయాల‌ని మోడీ, షా ఢిల్లీ కేంద్రంగా ర‌చించిన వ్యూహం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూద్దాం.!

Also Read:  US kills Al Qaeda leader: అమెరికా డ్రోన్ దాడి.. ఆల్ ఖైదా ముఖ్య నాయకుడు హతం