Site icon HashtagU Telugu

Jubilee Hills Voters: జూబ్లీహిల్స్‌లోని ఓట‌ర్ల‌కు అల‌ర్ట్‌.. ఈనెల 17 వ‌ర‌కు ఛాన్స్‌!

Jubilee Hills

Jubilee Hills

Jubilee Hills Voters: జూలై 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా (Jubilee Hills Voters) నమోదు చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 లోగా ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఆయన సూచించారు. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన “ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం-2025” గురించి కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమం కింద అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఓటరు నమోదు, సవరణలు ఇలా చేయండి

కొత్త ఓటరు నమోదు: 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవచ్చు.

పేరు చేర్చడం/తొలగించడం: ఇప్పటికే ఉన్న ఓటరు జాబితాలో పేరు చేర్చడం లేదా తొలగించడం వంటి అభ్యంతరాలను ఫారం-7 ద్వారా తెలియజేయవచ్చు.

వివరాల సవరణ: ఓటరు జాబితాలోని వివరాల సవరణ, నివాసం మార్పు, దివ్యాంగులుగా గుర్తించడం లేదా ఎపిక్ కార్డు మార్చుకోవడం కోసం ఫారం-8 ఉపయోగించవచ్చు.

Also Read: Jersey Sponsorship: టీమిండియా కొత్త‌ జెర్సీ స్పాన్సర్‌పై బిగ్ అప్డేట్‌ ఇచ్చిన బీసీసీఐ!

ఆన్‌లైన్ నమోదు సౌకర్యం

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పౌరులు ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ (VHA) ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్లయిన ceotelangana.nic.in, ecinet.eci.gov.in, eci.gov.in లలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని కమిషనర్ సూచించారు.

సహాయ కేంద్రాలు, హెల్ప్‌లైన్

మరింత సమాచారం కోసం సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO), AERO, ERO, DEOలను సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే, 1950 టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదని, బాధ్యత కూడా అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.