AI Based Civil Services: 2027 నాటికి ఒక కోటి మంది ప్రజలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI Based Civil Services) ఆధారిత పౌర సేవలను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సమస్య వచ్చిన తర్వాత స్పందించే ప్రభుత్వం కాదని, భవిష్యత్తును ఊహించి, ముందుగానే పరిష్కారాలను అందించే చురుకైన మరియు పారదర్శకమైన ప్రభుత్వం తమదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక శిక్షణ
జూబ్లీహిల్స్‌లోని డా. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో ‘ఏఐ-లెడ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ – ఛాంపియన్స్ & క్యాటలిస్ట్స్ ప్రోగ్రామ్’ పేరిట ప్రభుత్వ అధికారులకు నిర్వహించనున్న మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. AI సహకారంతో ప్రజలు అడగకముందే వారి అవసరాలను గుర్తించి, సేవలను వారి ముంగిటకు చేర్చే సరికొత్త తెలంగాణను నిర్మించాలన్నదే తమ సంకల్పమని పేర్కొన్నారు. ఈ నూతన తెలంగాణ ఐదు బిలియన్ డాలర్ల AI ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మారుతుందని, తద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని ఆయన వివరించారు.
Also Read: Nara Lokesh: కేంద్ర మంత్రులతో నారా లోకేష్ వరుస భేటీలు.. కీలక ప్రాజెక్టులపై చర్చ!
‘గ్లోబల్ ఏఐ క్యాపిటల్’ గా తెలంగాణ
తెలంగాణను ‘గ్లోబల్ ఏఐ క్యాపిటల్’గా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్లను అందుబాటులోకి తేబోతున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్ను ప్రారంభించి, ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్‌గా నిలిచామని ఆయన గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో, రాష్ట్రంలోని 20 ప్రభుత్వ శాఖలకు చెందిన 300 రకాల పౌర సేవలను AI ప్లాట్‌ఫాంపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
అధికారులకు AI మెంటార్‌షిప్
ఈ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 250 మంది అధికారులను ఎంపిక చేసి, వారికి AI వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ అధికారులు మూడు నెలల పాటు AI నిపుణుల మార్గదర్శకత్వంలో పనిచేస్తారని, తద్వారా వారు తమ తమ శాఖలలో AI ఆధారిత పరిష్కారాలను అమలు చేసేందుకు తోడ్పడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, డిప్యూటీ సెక్రెటరీ భవేష్ మిశ్రా వంటి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.