By Sk.zakeer
BRS Silver Jubilee: ”తమంతట తామే తగిలించుకునే గాయాలో,కొని తెచ్చుకునే బాధలో మనుషులు తమకు తామే ఎంచుకున్నట్లయితే కాలక్రమంలో మరొకరు చేసే గాయాల కన్నా తక్కువ బాధకు గురి చేస్తాయి” అని 1469 – 1527 కు చెందిన రాజకీయ తత్వవేత్త నికొలో మాకియవెలి అన్నాడు.ఇది ముమ్మాటికి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వర్తిస్తుంది.ఆయనను ఎవరూ గాయపరచలేదు.తనను తానే గాయపరచుకున్నారు.ఆయన ఇప్పుడు ఒక ‘గాయపడ్డ’ మనిషి.వేయి యుద్ధములలో ఆరితేరిన యోధునిగా గుర్తింపు పొందిన కేసీఆర్ ఓటమి గాయం నుంచి కోలుకోలేకపోతున్నారు.రేవంత్ రెడ్డి రూపంలో ఒక ‘ఉపద్రవం’ వచ్చి ముంచేయగలదని ఆయన ఊహించలేదు.అంచనాలు తలకిందులు కావడానికి,ప్రజల తిరస్కారానికి గురికావడానికి కేసీఆర్ ఒక్కరే కారణం.ఆయన ఎవరి మాటనూ లెక్క చేయకపోవడం,కొడుకు,కూతురు,మేనల్లుడు,తోడల్లుని కొడుకు వంటి స్వపరివారాన్ని నమ్ముకోవడమే నట్టేట ముంచింది.
‘ప్రజలకేమి కావాలో తనకు తెలుసు అని అనుకున్నారు కానీ,ప్రజలు ఏమనుకుంటున్నారో ఎప్పుడూ తనిఖీ చేసుకోలేదు.ప్రజాభిప్రాయం ఎలా ఉందో పసిగట్టలేకపోయారు.ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ, రైతుబంధు, పెన్షన్లు,కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్స్ రూపంలో డబ్బు పంపిణీ చేసినందున వాళ్లంతా తనను అధికారంలో శాశ్వతంగా ఉంచుతారని భావించారు.అయితే తెలంగాణ ప్రజలు ఎడ్డి వాళ్ళు కాదు.గుద్ది వాళ్ళు అంతకన్నా కాదు.కేసీఆర్ ‘ప్రగతిభవన్’ పరిపాలనను ప్రజలు జీర్ణించుకోలేకపోయారని,ఆయన పరివారం అహంకార ధోరణి పట్ల జనంలో ఆగ్రహం ‘లావా’ వలె గూడు కట్టుకుంటోందని కేసీఆర్ సరిగ్గా విశ్లేషించుకోలేకపోయారు.ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా కేసీఆర్ దారిలోనే విచ్చలవిడిగా ‘సంక్షేమం’ పేరిట నేరుగా ఓటర్లకు డబ్బు అందించారు.తీరా ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలలో ఓట్లు కురవలేదు.జనం ఆయనను ఇంటికి పంపించారు.11 సీట్లకే పరిమితం చేశారు.ఆ మాటకొస్తే కేసీఆర్ నయం. 39 అసెంబ్లీ స్థానాలతో బిఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా తయారైంది.కానీ అధికారం వేరు.ప్రతిపక్షం వేరు.అధికారంలో కొనసాగిన పదేండ్ల కాలంలో కేసీఆర్, ఆయన కుటుంబం వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
Also Read :Hafiz Saeed : ఆ ముష్కరుడి కనుసన్నల్లోనే పహల్గామ్ ఉగ్రదాడి !
ఇదంతా గడచిపోయి 15 నెలలు దాటాయి.ఇప్పుడిక పార్టీ రజతోత్సవాళ(BRS Silver Jubilee)పేరిట భారీ ‘బలప్రదర్శన’ కు కేసీఆర్ నడుం బిగించారు.బిఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్ ‘తెలంగాణ భవన్’ అన్నది కేవలం సాంకేతికమే.మొత్తం కార్యకలాపాలను కేసీఆర్ తన ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్ కు బదిలీ చేశారు.ఫార్మ్ హౌజ్ నుంచి రాజకీయపార్టీ కార్యక్రమాలను,సమావేశాలు,సమీక్షలు నడుపుతున్న పార్టీగా బిఆర్ఎస్ దేశంలోనే ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంపాదించుకున్నది.ప్రజలకు ప్రగతిభవన్ అయినా,ఫార్మ్ హౌజ్ అయినా ‘ఏవగింపు’ అన్న సంగతి కేసీఆర్ గ్రహించకపోవడం ఒక విషాదం.’నా మాటే శాసనం’ అని ఆయన అనుకుంటారు కనుక దానికిక తిరుగుండదు.జనంలో ఇలాంటి వ్యవహారాల వలన తప్పుడు సంకేతాలు వెడతాయని ఆయనకు ఎవరూ చెప్పే సాహసం చేయరు.చేసినా ఆయన వినే రకమూ కాదు.
ఎల్కతుర్తి బహిరంగసభలో కెసిఆర్ ఏమి మాట్లాడాతారన్నది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.’జాతీయ పార్టీ’ కథ ముగిసినట్లుగా అందరూ భావిస్తున్నారు.కనుక ‘ప్రాంతీయ వాదాన్ని’ ఆయన ఆశ్రయించనున్నారు.తెలంగాణ ప్రజల బాధలు,గాథలు తనకు కాకుండా మరెవరికీ తెలియదనీ,తాము మరలా అధికారంలోకి వస్తే తప్ప ‘తెలంగాణను గాడిలో పెట్టడం సాధ్యం కాద’ని కేసీఆర్ చెప్పనున్నట్టు తెలుస్తోంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ పూర్తిగా విధ్వంసమైపోయిందని ఆయన కొన్ని లెక్కలు చెప్పవచ్చు.మాటల గారడీలో దిట్ట కనుక తెలంగాణ మాండలికపు పంచ్ లు ఎలాగూ ఉంటాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ‘మోకాలెత్తు లేనోడు’ అని బాడీ షేమింగ్ చేయవచ్చు.
రజతోత్సవసభను కొందరు ‘జన బలప్రదర్శన’ అంటుండగా,మరికొందరు ‘ధనబల’ ప్రదర్శనగా విమర్శిస్తున్నారు.25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పడానికి బాహుబలి వేదిక నిర్మించారు.కనీవినీ ఎరుగని రీతిలో జనసమీకరణ జరుగుతోందని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.పది లక్షల మంది జనం హాజరవుతారని ఒక అంచనా.1213 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 159 ఎకరాల్లో సభా ప్రాంగణం,5 ఎకరాల విస్తీర్ణంలో సభా వేదిక ఉన్నాయి. ఐదు వందల మంది కూర్చునేలా సభా వేదిక తయారైంది.సభకు వెనుక 4 ఎకరాలు వీఐపీ పార్కింగ్‌కు కేటాయించారు.150 ఎకరాల్లో ప్రజలు,మీడియా, ఉద్యమకారులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.మిగిలిన స్థలాన్ని భోజన వసతి,పార్కింగ్ కోసం కేటాయించారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు,10 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు.ఈ సభకు మొత్తంగా దాదాపు 200 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
Also Read :Rahul : రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
కాగా ‘మర్దన కళ’ గురించి మనం మాట్లాడుకోవాలి.భౌతిక మర్దనకు దేహ సౌఖ్యం,ఆరోగ్యం మాత్రమే పరమ ప్రయోజనాలైతే, అభౌతిక మర్దనకు అంతకు మించిన ఆధిభౌతిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ‘మహదానందానికి మీరు కేవలం ఒక మర్దనదూరంలో ఉన్నారు’ అనేది ఒక మర్దన కేంద్రం వ్యాపార నినాదం.మర్దన కలిగించే మహదానందం కోసమే మనుషులు అర్రులు చాస్తుంటారు.భౌతిక మర్దనలో కించిత్ శారీరక శ్రమ ఉంటుంది గాని,అభౌతిక మర్దనలో అలాంటిదేమీఉండదు.ఊరకే నోటికి పనిచెప్పి, ఎదుటివారికి పరమానందం కలిగించే మాటలు అదను చూసి మాట్లాడితే చాలు- భౌతిక మర్దనకు మించిన ప్రయోజనాలు అనాయాసంగానే నెరవేరుతాయి.అభౌతిక మర్దనకు కీలక సాధనం పొగడ్త.పొగడ్త అగడ్త అని అంటారు.చాలామందికి ఈ సంగతి తెలిసినా,తెలిసి తెలిసి మరీ పొగడ్తలకు పడిపోతారు.పొగడ్త ‘మనోమర్దన’ కళ.పొగడ్తలతో ఎదుటివారిని పడగొట్టడం ఒక కళ అయితే,పొగడ్తలకు పడిపోవడం ఒక బలహీనత.మనుషులన్నాక బలహీనతలు సహజం. మరి మనుషులన్నాక కొంత కళాపోషణ కూడా ఉండాలి కదా! అధికారంలో ఉన్న అత్యధికులకు పొగడ్తలు ఒక వ్యసనం.అధికారంలో ఉన్నవారిని పొగుడుతూ పబ్బం గడుపుకోవడం చాలామంది బతకనేర్పరులకు ఒక కాలక్షేపం.అధికారంలో ఉన్నవారు చండశాసనులుగా ఎంతటి ప్రచండ ప్రఖ్యాతి పొందినా, ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి’ అని ఎరిగిన ధీమంతులు అలాంటివారిని కూడా తమ ‘వాగ్మర్దన కళ’తో సులువుగా లోబరచుకుంటారు.కేసీఆర్ అంతటి గొప్ప రాజకీయ నాయకుడు ఈ పొగడ్తలకు,మనో మర్దన కళకు లొంగిపోయినందువల్లనే ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకున్నారు.’ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని’ భజనపరులు చేసిన ‘మసాజ్’ కేసీఆర్ ను ఎక్కడో ఊహాలోకాల్లోకి తీసుకుపోయింది.
తెలంగాణ గడ్డ పోరాటాలకు అడ్డ అనేది జగమెరిగిన సత్యం.ఆత్మగౌరవ పోరాటం నుంచే తెలంగాణ ఉద్యమం ఉద్భవించింది. తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచిన కొమరం భీం చరిత్ర మనకున్నది. నైజాం నవాబుల అరాచకాలను అణిచివేసిన, రాంజీ గోండు పోరాట వారసత్వం మనది. చివరకు ఆంధ్ర వలస పాలకులను పారద్రోలడానికి,తొలి,మలిదశ తెలంగాణ పోరాటాలను చేసి, తెలంగాణ సాధించిన నేల మనది.ఈ ఉద్యమం పోరాటాలలో వేలమంది నేలకొరిగారు.లక్షల మంది గొప్ప త్యాగదనులుగా చరిత్రలో నిలిచిపోయారు.ఎన్నో చారిత్రక ఆధారాలు,మరెన్నో చరిత్ర పుస్తకాలు ఇవి నిజమని చెప్పడానికి మనకు సాక్ష్యాధారాలుగా ఉన్నవి. కానీ కేసీఆర్ మాత్రం తానే చరిత్ర అని,తనతోనే చరిత్ర లిఖించబడిందని గట్టిగా నమ్ముతారు.అందుకే ఆయనను ‘జాతిపిత’ గా ఎవరైనా పిలిస్తే సంబరపడిపోతారు.’తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో రాళ్ళెత్తిన కూలీలను’ ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ విస్మరించారు.
తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనా జరుగుతోంది.కేసీఆర్ హయాంలో ఉద్యోగాల భర్తీ జరగకపోగా జరిగినా లీక్‌లు,రద్దు,కోర్టు కేసులు అంటూ నిరుద్యోగుల ఆకాంక్షలు దెబ్బతీశారు. అయినా నిరుద్యోగులలో మునుపటి ఉద్యమాలు లేకపోవడం ఒక పరిణామమే. అప్పటి పోరాటాలు లేవు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఉద్యోగాన్ని పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారు.ఆ సమయంలో ఉపాధ్యాయుల సమస్యలు సర్వీసు రూల్స్ కు ‘ఇన్ని పేజీలెందుకు,మూడు పేజీలు సరిపోవా’? అని తెలంగాణ వస్తే అసలు సమస్యలే ఉండవన్నట్టు కేసీఆర్ అన్నారు.ఒకప్పుడు ప్రభుత్వాలను గడగడలాడించిన ఉద్యోగ సంఘాల నాయకులు పదవుల కోసం పాలకుల చుట్టూ పాకులాడేలా కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరించారు.
తెలంగాణ వస్తే మన నిధులు మనమే ఖర్చుపెట్టుకుంటామని,మన నీళ్ళు మనకే వస్తాయని తద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఉద్యమంలో జనం పాల్గోన్నారు.కానీ తెలంగాణ వచ్చాక ఏమైంది? మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించి, పైగా సంపద సృష్టించినట్టుగా ప్రచారం చేసుకోవడం బిఆర్ఎస్ పార్టీకే చెల్లుబాటు అవుతోంది. అధికారం కోసం ఉచితాల పేరుతో దగ్గర బంధువులకు, కోట్లకు కోట్లను కట్టబెట్టి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నా ప్రశ్నించిన వారు లేరు ఉచిత పథకాల పేరుతో మానవ వనరులను,ప్రకృతి సంపదను,జలవనరులను చెరబట్టినా ప్రతిఘటించిన వారు లేరు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ భావ ప్రకటన స్వేచ్ఛ లేదు.ప్రజాస్వామిక స్వేచ్ఛ లేదు. ఎన్నో నిర్బంధాలు,మరెన్నో ఆంక్షలు.ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ 15 నెలల్లోనే ఆర్ధిక రంగం చిన్నాభిన్నమైపోయినట్లు, రాష్ట్రమంతటా అంధకారం అలుముకున్నట్టు,ప్రజలు తిండి లేక మల మల మాడిపోతున్నట్లు,రైతులు పొలాల్లో,వ్యవసాయ మార్కెట్లలో పిట్టల మాదిరిగా రాలిపోతున్నట్టు కేసీఆర్ చేస్తున్న ప్రచారం ప్రజల్లో బలంగా తీసుకువెడుతున్నారు.
ఇలాంటి ప్రచారపర్వానికి పరాకాష్టగానే ఎల్కతుర్తి సిల్వర్ జూబిలీ సభను చూడవలసి ఉన్నది.పైగా ‘ప్రభుత్వ వ్యతిరేక సభ’ గా రజతోత్సవ సభ మారిపోతుందని మాజీమంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నిర్వచించారు.ఈ సభలో రేవంత్ రెడ్డిపై ఎన్ని టన్నుల నిప్పులు కురిపించగలరో,ఎన్ని టన్నుల బురద జల్లనున్నారో ఊహించడం కష్టం కాదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల్లో ‘తిరుగుబాటు’ మొదలయిందంటూ కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు.అధికారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ,రెండో టర్మ్ లోనూ గెలిచే వ్యూహాలను ఇప్పటినుంచే రేవంత్ పదునుబెడుతున్నారు.బీఆర్ఎస్ ప్రాంతీయవాద జాతీయ పార్టీయా? లేక జాతీయవాద ప్రాంతీయ పార్టీయా? అన్న అంశంపై బీఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ తమ పార్టీ రజతోత్సవ సభలో స్పష్టత ఇవ్వవచ్చు.ఉద్యమ ఆకాంక్షల పునాదులపై నిర్మించిన టిఆర్ఎస్ కు,ఇతర ప్రాంతీయ పార్టీలతో పోలికే లేదు.టిఆర్ఎస్ ‘రాజ్యాంగం’ వేరు.కేసీఆర్ ‘సిలబస్’ వేరు.ఆయనే ఒక యూనివర్సిటీ.’ఫక్తు రాజకీయపార్టీ’ అని ప్రకటించిన నాటి నుంచే మిగతా పార్టీల అవలక్షణాలన్నీ వచ్చేశాయి.