New Ministers 2025 : ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సహా 11 మంది మంత్రులు ఉన్నారు. సంక్రాంతిలోగా లేదా సంక్రాంతి తర్వాత మరో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రిమండలిలో చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. సంక్రాంతిలోగా రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవుల కోసం ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైనల్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. మంత్రి పదవుల కోసం ఎంపిక చేసిన ఎమ్మెల్యేల ప్రొఫైల్స్ గురించి కాంగ్రెస్ పెద్దలకు వివరిస్తారని అంటున్నారు. ఈ వివరాలు చివరగా రాహుల్ గాంధీ కార్యాలయం వద్దకు చేరుతాయని, ఆయన ఆమోదం పొందే వాళ్లకు తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని తెలిసింది. అయితే మంత్రి పదవులకు ఎమ్మెల్యేల పేర్లను ఖరారు చేసే సమయంలో సీఎం రేవంత్ సలహాను రాహుల్ గాంధీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
Also Read :Mosque Surveys : మసీదుల సర్వేకు ఆదేశాలివ్వొద్దు.. కోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికీ తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయా జిల్లాల్లో ఎవరికీ మంత్రి పదవులు దక్కకుంటే లోకల్ బాడీ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి నెగెటివ్ ఫలితాలు వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే ఆయా ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలనే పట్టుదలతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పోస్టులను భర్తీ చేసేందుకూ సీఎం రేవంత్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. సీనియర్లు, దీర్ఘకాలంగా పార్టీలో విధేయంగా పనిచేస్తున్న వారికి ఈ రెండు పోస్టులు దక్కుతాయని సమాచారం.
Also Read :WhatsApp Translator : ‘వాట్సాప్ ట్రాన్స్‌లేటర్’ వస్తోంది.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?
రేసులో ఉన్నది వీరే..
మంత్రి పదవుల కోసం పోటీపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల లిస్టు(New Ministers 2025) పెద్దదే ఉంది. ఈ జాబితాలో మల్‌రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్, మల్‌రెడ్డి రంగారెడ్డి, వివేక్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల కోసం మల్‌రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్‌లు ఢిల్లీ స్థాయిలో ఇప్పటికే లాబీయింగ్ నడుపుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జనవరి నెలలో దాదాపు 8 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్‌కు కైవసం కానున్నాయి. వాటిలో కొలువుతీరనున్న నేతల్లోనూ ఒకరిద్దరికి మంత్రి పదవులు దక్కుతాయనే టాక్ వినిపిస్తోంది. షబ్బీర్ అలీ, పహీం ఖురేషీల పేర్లను మంత్రి పదవుల కోసం సీఎం రేవంత్ ప్రతిపాదిస్తారనే ప్రచారం జరుగుతోంది.