Mahesh Babu : హైదరాబాదీ రియల్ ఎస్టేట్ సంస్థలు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌లతో సంబంధమున్న మనీ లాండరింగ్ కేసులో ఈరోజు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హీరో మహేశ్ బాబు హాజరుకావాల్సి ఉంది. విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపింది. ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలంటూ తొలిసారి మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు పంపింది. అయితే షూటింగ్‌లో బిజీగా ఉన్నందున.. విచారణకు హాజరయ్యేందుకు కొంత టైం ఇవ్వాలని ఈడీ అధికారులను ఆయన కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఈడీ అధికారులు, మే 12న (సోమవారం) విచారణకు హాజరు కావాలని సూచించారు. దీని ప్రకారం ఇవాళ ఈడీ ఎదుటకు మహేశ్ బాబు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ రోజు మహేష్ బాబు విచారణకు హాజరవుతారా ? లేదా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read :Indian Army : ఆగిన కాల్పులు.. 19 రోజుల తర్వాత ఎల్‌ఓసీ వద్ద ప్రశాంతత
ఏమిటీ కేసు ?
మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్‌ను ప్రమోట్ చేశారు. అందుకు రెమ్యునరేషన్‌గా రూ. 5.9 కోట్లు తీసుకున్నారు. ఇందులో రూ. 3.4 కోట్లను నగదు రూపంలో, రూ. 2.5 కోట్లను ఆర్‌టీజీఎస్ (RTGS) పద్ధతిలో పొందారు. ఏప్రిల్ 16న హైదరాబాద్‌లో సురానా గ్రూప్(Mahesh Babu), సాయి సూర్య డెవలపర్లలో సోదాలు చేసిన టైంలో ఈ లావాదేవీల వివరాలను ఈడీ అధికారులు గుర్తించారు.ఆర్‌టీజీఎస్ ద్వారా మహేశ్ బాబు పొందిన డబ్బు ఎలాగో బ్యాంకు ఖాతాల్లో నమోదవుతుంది. కానీ నగదు రూపంలో తీసుకున్న రూ. 3.4 కోట్లను ఏం చేశారు ? వాటిని లెక్కల్లో అడ్జస్ట్ చేశారా .. లేదా ? అనే దానిపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. ఒకవేళ పన్ను ఎగవేత కోసమే రూ. 3.4 కోట్లను నగదు రూపంలో తీసుకొని ఉంటే దాన్ని చట్టపరమైన అపరాధంగా పరిగణిస్తారు.
Also Read :Tibet Earthquake : టిబెట్‌లో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు
3 బ్యాంకులను ముంచిన సురానా గ్రూప్
కొద్ది రోజుల క్రితమే సాయిసూర్య డెవలపర్స్‌కు చెందిన సతీశ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వట్టి నాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీశ్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు సురానా గ్రూప్ 3 బ్యాంకులకు రూ. 3,986 కోట్ల అప్పులను ఎగ్గొట్టింది. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో ఆ వ్యాపార గ్రూప్‌పై సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. సురానాకు అనుబంధంగా సాయిసూర్య డెవలపర్స్ పని చేస్తోంది. 2021 ఫిబ్రవరిలో సురానా కంపెనీలో జరిగిన ఈడీ సోదాల్లో రూ. 11 కోట్ల 62 లక్షల విలువైన బంగారం, నగదు సీజ్ చేశారు. సురానా గ్రూప్ అనుబంధ సంస్థలపై మనీలాండరింగ్ కేసును కూడా నమోదు చేశారు.