Formula-E Race Case : ఫార్ములా వన్ రేస్ అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ..కేటీఆర్‌పై చర్యలు తీసుకోవడం తప్పేం కాదని అన్నారు. క్యాబినెట్ అనుమతి లేకుండా ఫార్ములా వన్ రేసు కోసం ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేస్తారని ప్రశ్నించారు. ఫార్ములా వన్ రేసు తొందరపాటు నిర్ణయం కాదని.. కేసీఆర్ ప్రభుత్వ తప్పిదమని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఫార్ములా వన్ రేసులో కేటీఆర్ తప్పు చేశారని ఆయన అన్నారు.
కాళేశ్వరం ఇలా ఎందుకు అయ్యిందో విచారణకు వచ్చి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పాల్సిందేనని కోదండరాం అన్నారు. కాళేశ్వరం విచారణకు రావడం కేసీఆర్ బాధ్యత అని చెప్పారు. పనికిరాని స్థలంలో మేడిగడ్డ కట్టారని ఎమ్మెల్సీ కోదండరాం విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిందేనని చెప్పారు. మేడిగడ్డ పనికిరాదని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. అన్ని డబ్బులు ఖర్చు చేసినా డిజైన్ లోపాలు, నాణ్యత లోపాలు ఉన్నాయని అన్నారు. కాళేశ్వరం పనికిరాదని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం చేయాలనే డిమాండ్‌కి రేవంత్ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని నమ్ముతున్నానని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.
కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. 13(1)A, 13(2) పీసీ యాక్ట్ కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వాటితో పాటు 409, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మొత్తంగా నాలుగు సెక్షన్ల కింద కేటీఆర్‌పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఫార్ముల్ ఈ- రేసింగ్ కేసులో.. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, A3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇండనీర్ బీఎల్ఎస్ రెడ్డిగా ఏసీబీ పేర్కొంది.