Formula E Case : ఓ వైపు బీఆర్ఎస్ పార్టీలో కవిత, కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతుండగా.. మరోవైపు తెలంగాణ అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) యాక్షన్ మొదలుపెట్టింది. ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది. మే 28న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు, బీఆర్ఎస్ రజతోత్సవాలకు హాజరయ్యేందుకు లండన్, అమెరికా పర్యటనలు ముందే ఖరారైనందున మే 28న విచారణకు కాలేనని కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా విదేశాల నుంచి తిరిగొచ్చిన వెంటనే విచారణకు హాజరవుతానని ఏసీబీకి కేటీఆర్ లిఖితపూర్వకంగా తెలియజేశారు.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం @KTRBRS గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 26, 2025
రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈ కేసు..
ఈ కేసును రాజకీయ వేధింపుల్లో భాగంగానే నమోదు చేశారని, అందులో విషయమేం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే, తనపై ప్రతీకారంతో నోటీసులు పంపారని చెప్పారు. బీఆర్ఎస్ అంటే సీఎం రేవంత్‌రెడ్డి(Formula E Case)లో భయం పెరుగుతోందన్నారు. ‘‘48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసు అభియోగపత్రంలో రేవంత్‌రెడ్డి పేరు బయటకు రాగా, 24 గంటల తర్వాత ఆయన ప్రధాని మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలతో సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించారు. ఈ కేసులో రేవంత్‌రెడ్డి పాత్ర గురించి ఒక్క బీజేపీ నాయకుడూ మాట్లాడకపోవడం రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనకు నిదర్శనం’’ అని కేటీఆర్ కామెంట్ చేశారు.
Also Read :Cabinet Expansion: పార్టీ పదవుల వ్యవహారం.. పలువురు సీనియర్లపై రాహుల్ ఫైర్
కేటీఆర్‌కు నోటీసులపై కవిత ట్వీట్
కేటీఆర్‌కు ఏసీబీ నోటీసుల జారీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యల నుంచి దృష్టిని మళ్లించడానికి రేవంత్ ప్రభుత్వం కుట్రపన్నిందని ఆమె ఆరోపించారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ సైనికులు తట్టుకొని నిలబడ్డారని కవిత గుర్తు చేశారు. కేటీఆర్‌తో విబేధాలు వచ్చాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కవిత ఈ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ నాయకులకు వరుస నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని తేటతెల్లం అవుతోందని కవిత ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు, రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోందన్నారు.