Site icon HashtagU Telugu

Formula E Car Race Case : A1 గా కేటీఆర్ – ACB

Ktr Acb

Ktr Acb

గత కొద్దీ రోజులుగా ఫార్ములా ఈ రేసు కేసు(Formula E Car Race Case) కు సంబంధించి తెలంగాణ బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)ను అరెస్ట్ చేస్తారనే వార్తలు వైరల్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కేటీఆర్‌(KTR)ను విచారించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా ఈ కేసులో కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా (A1) ఏసీబీ పేర్కొంది. అదనంగా అర్వింద్ కుమార్‌ను A2గా, బీఎల్ఎన్ రెడ్డిని A3గా ఈ కేసులో చేర్చారు. అధికారులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 13(1A), 13(2), ఐపీసీ సెక్షన్లు 409, 120 కింద కేసులు నమోదు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందని ఛార్జ్ షీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన నిధుల ప్రవాహాన్ని ఆడిట్ చేయనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. కేసు నమోదైన వెంటనే ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. కేటీఆర్ పై నమోదైన కేసు నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేయడం ఖాయమని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

అసలు ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసు ఏంటి..?

తెలంగాణ ప్రభుత్వం 2023లో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-కార్‌ రేసును ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ రేసు ద్వారా రాష్ట్రంలో టూరిజం, ఆటోమొబైల్ రంగాలను ప్రోత్సహించడంతో పాటు, హైదరాబాద్‌ను గ్లోబల్ ఈవెంట్ లొకేషన్‌గా నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ రేసు నిర్వహణ కోసం ఖర్చు చేసిన ప్రభుత్వ నిధుల విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు తలెత్తాయి.

కేసు నమోదుకు కారణం ..?

ఫార్ములా ఈ-కార్‌ రేసుకు సంబంధించి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఏసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) ఈ కేసు నమోదు చేయగా, నిధుల సరైన వినియోగం లేకపోవడం, అధిక చెల్లింపులు చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టింది.

కేటీఆర్ పై ఆరోపణలు ..?

ఈ కేసులో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను A1 నిందితుడిగా పేర్కొన్నారు. ఆయనపై ఈ ఈవెంట్ నిర్వహణ సమయంలో బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేదని, నిధుల దుర్వినియోగానికి సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకంగా, కొన్ని కాంట్రాక్టులు, ఖర్చుల విషయంలో అనుమానాస్పద అంశాలు ఉన్నట్లు ఏసీబీ పేర్కొంది.

ఈ కేసు పై బిఆర్ఎస్ పార్టీ స్పందన..

ఈ కేసుపై బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కేటీఆర్‌పై ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరణతో నిండిపోయినవని, ఇది ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణించారు. ప్రభుత్వ నిధుల ఉపయోగం విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని టీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు.ఇక ఈ కేసు రాజకీయంగా మాత్రమే కాకుండా సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్‌ అభివృద్ధి పేరుతో నిర్వహించిన ఈవెంట్‌పై నిధుల అక్రమాల ఆరోపణలు తలెత్తడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసింది. ఏసీబీ దర్యాప్తు తర్వాత పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు ఎటువంటి మలుపులు తీసుకుంటుందో, కేటీఆర్‌పై ఆరోపణలు నిరూపితమవుతాయా లేదా అనేది చూడాలి.

Read Also : 10th class exam : తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల