Formula E-Car Race Case : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గచ్చిబౌలి ఓరియన్ విల్లాకు వెళ్లిన అధికారులు నోటీసులిచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈసారి కూడా లీగల్ టీంకు అనుమతి లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేర్లను ఏసీబీ చేర్చింది. మరోవైపు ఏసీబీ కేసు ఆధారంగా ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో విచారణలో భాగంగా జనవరి 6 వ తేదీ హాజరుకావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు, ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక అంశాలను బయటపెట్టిన విషయం తెలిసిందే.
కాగా, ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులిచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యారు. అయితే, ఆయన వెంట లాయర్లను పోలీసులు అనుమతించకపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన వెంట లాయర్లు ఎందుకు రాకుడదని.. వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. తన న్యాయవాదిని తన వెంట అనుమతించకపోవడంపై కేటీఆర్ పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దాదాపు అరగంటపాటు అక్కడ ఎదురుచూసిన కేటీఆర్.. చివరికి ఏసీబీ ఆఫీసులోపలికి వెళ్లకుండానే వెనుదిరిగారు. రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్టప్రకారం ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు.
Read Also: HMPV : హెచ్ఎంపీవీ కేసుల పై కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక సూచనలు