Warangal Earthquake : తెలంగాణలోని వరంగల్ నగరంలో శుక్రవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 4.43 గంటలకు స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం (NCS) వెల్లడించింది. వరంగల్‌కు తూర్పున 127 కిలోమీటర్ల దూరంలో, దాదాపు 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూకంప కేంద్రం సరిగ్గా భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఉందని భూకంప అధ్యయన విభాగం చేసిన ట్విట్టర్ పోస్ట్‌ను బట్టి అర్థమవుతోంది. ఇక తెల్లవారుజామునే భూప్రకంపనలతో వరంగల్ వాసులు వణికిపోయారు. ఏం జరిగిందో తెలియక ఇళ్లలో నుంచి జనం బయటకు పరుగులు తీశారు. నిద్రలో ఉన్నవారు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Also read : Today Horoscope : ఆగస్టు 25 శుక్రవారం రాశి ఫలితాలు.. వారి డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోవచ్చు
మణుగూరులోనూ శుక్రవారం తెల్లవారుజామున భూప్రకంపనలు (Warangal Earthquake) చోటుచేసుకోవడంతో జనం ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఐదు రోజుల క్రితం (శనివారం సాయంత్రం) కూడా మణుగూరు మండలంలో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. స్థానికంగా ఉన్న సింగరేణి బొగ్గు గనుల్లో సహజంగా బ్లాస్టింగ్‌లు మధ్యాహ్నం మూడు గంటల నుంచి 3.30గంటల సమయం వరకు మాత్రమే జరుగుతుంటాయి. అయితే గత శనివారం భూప్రకంపనలు సాయంత్రం 4గంటలు దాటిన తర్వాత చోటుచేసుకున్నాయి.