Anganwadi Jobs: అంగన్‌వాడీ కేంద్రాల్లో జాబ్స్ కోసం ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తుంటారు. వారికి గుడ్ న్యూస్. త్వరలోనే దాదాపు 14,236 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఫైలుపై మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అది ముగిసిన వెంటనే జిల్లాల స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ పోస్టుల(Anganwadi Jobs) భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తారు. 6,399 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 7,837 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Also Read :Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమం.. ఆయన నేపథ్యం ఇదీ..
ఖాళీలు ఇలా ఏర్పడ్డాయి..
ప్రస్తుతం తెలంగాణలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లలో 65 ఏళ్ల వయసు దాటిన వారు 3,914 మంది ఉన్నారు. వీరంతా పదవీవిరమణ చేయనున్నారు. దీంతో ఆయా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌తో పాటు హెల్పర్ తప్పనిసరి. గతంలో హెల్పర్ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేశారు. దీంతో ఆ పోస్టులను ఇప్పుడు భర్తీ చేయనున్నారు. ఇక కొందరు అంగన్‌వాడీ హెల్పర్లకు సూపర్‌వైజర్లుగా పదోన్నతులు వచ్చాయి. ఆ విధంగా ఇంకొన్ని హెల్పర్ ఖాళీలు ఏర్పడ్డాయి.
567 మంది హెల్పర్లకు గుడ్ న్యూస్
దేశంలోని అన్ని రాష్ట్రాలు అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీలో 50 శాతం ఖాళీలను సహాయకులకు కేటాయించాలని కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయి. ఇంటర్ పాసైన హెల్పర్లకు మాత్రమే అంగన్‌వాడీ టీచర్‌గా అవకాశం లభిస్తుంది. తెలంగాణలో ఇంటర్ పాసైన హెల్పర్లు 567 మందే ఉన్నారు. వారికి పదోన్నతులు లభిస్తాయి. గతంలో కనీసం పదో తరగతి పాసైన వారిని అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు తీసుకునేవారు. ఇప్పుడు ఈ విద్యార్హతను ఇంటర్‌కు పెంచారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు.