Site icon HashtagU Telugu

Postal Jobs 21413 : భారీగా ‘తపాలా’ జాబ్స్.. తెలుగు రాష్ట్రాల్లోనూ వందలాది ఖాళీలు

Postal Department Jobs 21413 With 10th Ap Telangana Postal Gds Recruitment

Postal Jobs 21413 : భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్)లో ఏకంగా 21,413 గ్రామీణ్ డాక్ సేవక్  జాబ్స్‌ను భర్తీ చేస్తున్నారు. వీటిలో 1215 పోస్టులు ఆంధ్రప్రదేశ్‌లో, 519 పోస్టులు తెలంగాణలో ఉన్నాయి. పదో తరగతి పాసై, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారంతా వీటికి అప్లై చేయొచ్చు.  మార్చి 3 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులను సమర్పించొచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్ ఉమెన్‌కు దరఖాస్తు  ఫీజు లేదు. దరఖాస్తు చేసేవారు ఫొటో, సంతకాన్ని పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.  దరఖాస్తు చేసిన తర్వాత మార్చి 6 నుంచి 8 వరకు కరెక్షన్స్  చేసుకునే వెసులుబాటును కల్పిస్తారు.గ్రామీణ్ డాక్ సేవక్ కింద బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవకులను నియమించనున్నారు. అభ్యర్థులకు సైకిల్ లేదా స్కూటర్ నడిపే నైపుణ్యం ఉండాలి. పదో తరగతి పరీక్షల్లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

వయో పరిమితి ? వేతనం ? 

ఈ ఉద్యోగాలకు(Postal Jobs 21413) అప్లై చేసే వారికి కనీస వయసు 18 ఏళ్లు. గరిష్టంగా 40 ఏళ్ల వారు కూడా అప్లై చేయొచ్చు. అయితే కొన్ని వర్గాల వారికి గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు లభిస్తాయి. బీపీఎం పోస్టులకు ఎంపికయ్యే వారికి ప్రతినెలా  రూ.12,000 నుంచి రూ.29,380 వరకు పే స్కేల్‌ను అమలు చేస్తారు. ఏబీపీఎం/డాక్ సేవక్ పోస్టులకు ఎంపికయ్యే వారికి  రూ.10,000 నుంచి రూ.24,470 వరకు పే స్కేల్‌ను అమలు చేస్తారు.

గమనిక 

జీడీఎస్ పోస్టులకు ఎంపికయ్యే వారిని కేంద్ర ప్రభుత్వం/ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించరు. వీరి జీతాలు, అలవెన్సులు, ఇతర అర్హతలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉండవు. అయినా ఈ ఉద్యోగాలకు యువత పెద్దసంఖ్యలోనే అప్లై చేసుకుంటున్నారు. దేశంలో ఉన్న నిరుద్యోగమే దీనికి ప్రధాన కారణం. దొరికిన ఏ చిన్నపాటి అవకాశాన్నీ వదులుకునేందుకు యువత సిద్ధంగా లేరు.