Farmers Suicide: తెలంగాణలో రాలిపోతున్న రైతన్నలు!

రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, పీఎం కిసాన్ లాంటి పథాకాలేవీ.. అన్నదాతల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి.

  • Written By:
  • Updated On - March 16, 2022 / 04:04 PM IST

రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, పీఎం కిసాన్ లాంటి పథాకాలేవీ.. అన్నదాతల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి. టెక్నాలజీ పరుగులు పెడుతున్నా.. ప్రభుత్వాలు మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారింది. పెట్టుబడులు చేతికిరాకపోవడం, ఉన్న అప్పులు పెరిగిపోవడంతో అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నారు. సాగు చేయలేనంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే గత రెండు నెలల్లో 20 మంది మిర్చి రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడలేక ప్రాణాలు విడిచినట్లు నివేదిక పేర్కొంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల పరిస్థితి ఏం చేయాలో,  ఎటు వెళ్లాలో తెలియక దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. రైతు స్వరాజ్య వేదిక (హ్యూమన్ రైట్స్ ఫోరమ్) కార్యకర్తల బృందం మార్చి 12, 13 రెండు రోజుల క్షేత్ర పర్యటనలో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సముద్రం, మహబూబాబాద్,  దంతాలపల్లి,  మరిపెడ మండలాల్లోని 12 మంది రైతుల కుటుంబాలను ఈ బృందం కలిసి రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడింది.

మహబూబాబాద్, కేసముద్రం మండలాల్లోనే అత్యధిక ఆత్మహత్యలు జరిగాయి. నెల్లికుదురు, డోర్నకల్‌ మండలాల్లో ముగ్గురు చొప్పున ఆత్మహత్యలు చేసుకోగా, దంతాలపల్లి, మరిపెడ మండలాల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ చాలా మంది రైతులు కొన్నేళ్లుగా వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మిర్చి వంటి పంటల పెట్టుబడికి కౌలు మొత్తానికి అదనంగా ఎకరానికి లక్ష అవుతుంది. భారీ వర్షాలు, నల్లరేగడి పురుగుల కారణంగా పంట నష్టపోవడాన్ని జీర్ణించుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అని రైతులను కలిసిన బృందంలో ఒకరైన బి. కొండల్ రెడ్డి వెల్లడించారు. అయితే ప్రతి  కుటుంబం రూ.6 లక్షల నుండి 12 లక్షల మధ్య అప్పులు కలిగి ఉన్నట్లు తేలింది.

దేవిరెడ్డి వెంకట రెడ్డి కుటుంబం మాత్రమే గత 15 సంవత్సరాలుగా సుమారు  20 లక్షల అప్పులను కలిగి ఉంది. మొదటి నుండి ఆ కుటుంబం అప్పుల ఊబి నుండి బయటపడలేకపోయింది. దీంతో వెంకటరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలున్నారు. మహబూబాబాద్ మండలం పర్వతిగిరి గ్రామానికి చెందిన 25 ఏళ్ల నారమళ్ల సంపత్ కుటుంబానిదీ ఇదే పరిస్థితి. ట్రాక్టర్ లోన్ తీసుకుని పొరుగువారి కొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. పేరుకుపోయిన నష్టాలతో క్రిమిసంహారక మందు తాగి ప్రాణాలు వదిలాడు. అతనికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఈ రైతుల ప్రైవేట్ రుణాలను వన్ టైమ్ సెటిల్‌మెంట్‌గా తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ కుటుంబాలకు ప్రత్యేక పెన్షన్ సౌకర్యం కల్పించాలి అని పలు రైతు సంఘాలు దీనంగా వేడుకుంటున్నాయి.