Site icon HashtagU Telugu

Pocharam Barrage : రికార్డు వరదను తట్టుకున్న 100 ఏళ్ల పోచారం బ్యారేజ్ ..అసలు సీక్రెట్ ఇదే !!

Pocharam Dam

Pocharam Dam

కామారెడ్డి జిల్లాను వర్షాలు వణికిస్తున్న వేళ, పోచారం ప్రాజెక్ట్ ఒక కీలక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. భారీ వరదలతో వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రాజెక్టులోకి నీరు అధికంగా చేరింది. గరిష్టంగా 70,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకునే సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్, 1,82,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కూడా తట్టుకుని నిలబడటం ఆశ్చర్యం కలిగించింది. 103 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్ట్ దెబ్బతింటుందేమోనని స్థానిక ప్రజల్లో భయం నెలకొన్నా, చివరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా నిలిచింది. దీనితో ప్రజలు ఉపశమనం పొందారు.

Rain Effect : తెలంగాణలో భారీ వర్షాలు.. 36 రైళ్లు పూర్తిగా రద్దు

1917లో నిర్మాణం ప్రారంభమై 1922లో పూర్తయిన పోచారం ప్రాజెక్ట్, నిజాం ప్రభుత్వ కాలంలో నిర్మించబడిన తొలి ప్రాజెక్టులలో ఒకటి. అప్పట్లో రూ. 27.11 లక్షల వ్యయంతో నిర్మించబడిన ఈ ప్రాజెక్ట్ అసలు సామర్థ్యం 2.423 టీఎంసీలు కాగా, ప్రస్తుతం పూడిక కారణంగా 1.82 టీఎంసీలకు తగ్గింది. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలతో పాటు మెదక్ మండలాలకు సాగునీరు, తాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 10,500 ఎకరాల భూమి సాగులోకి వస్తోంది. శతాబ్దానికి పైగా గడిచినా ఇంకా ప్రజల అవసరాలను తీరుస్తూ నిలబడటం, ఆ కాలం నాటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

ఈ ప్రాజెక్ట్ సున్నపురాయి నిర్మాణంతో, 1.7 కిలోమీటర్ల పొడవు, 21 అడుగుల ఎత్తుతో బలమైన కట్టడంగా రూపుదిద్దుకుంది. 58 కిలోమీటర్ల ప్రధాన కాలువతో పాటు 73 డిస్ట్రిబ్యూటరీలు నిర్మించి రెండు జోన్లుగా విభజించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల వేల ఎకరాల భూమి సాగునీరు పొందుతూ, రైతులకు జీవనాధారంగా మారింది. అయితే, పూడికతో సామర్థ్యం తగ్గిపోవడం, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం ప్రాజెక్ట్ భవిష్యత్తుకు ముప్పుగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పూడిక తొలగింపు, ప్రాజెక్ట్ సంరక్షణపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.