Rice Millers : తెలంగాణ పౌర సరఫరాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి పెద్దఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంటుంది. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు అప్పగిస్తుంటుంది. ఇలా పౌర సరఫరాల సంస్థ అప్పగించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసే క్రమంలో కొందరు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ధాన్యం మిల్లింగ్ వ్యవహారంలో 10 మంది మిల్లర్లు పౌర సరఫరాల సంస్థకు దాదాపు రూ.605 కోట్లు బకాయిపడినట్లు తెలుస్తోంది. జరిమానాతో కలుపుకుంటే.. ఇది దాదాపు రూ.720 కోట్లు అవుతుంది. ఈ పది మంది మిల్లర్లలో ఆరుగురు సూర్యాపేట జిల్లావారే. ఇద్దరిది కరీంనగర్ జిల్లా. నాగర్‌కర్నూల్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది బాయిల్డ్ రైస్ మిల్లుల యజమానులు(Rice Millers). మిగతా ఇద్దరు రా రైస్ మిల్లర్లు. పౌర సరఫరాల సంస్థ కేటాయించిన దాదాపు 1.67 లక్షల టన్నుల బియ్యాన్ని వీరు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆ పది మంది మిల్లర్ల నుంచి 12,972 టన్నుల బియ్యాన్ని మాత్రమే అధికారులు రాబట్టగలిగారు.
Also Read :AR Rahman Divorce : భార్య సైరాకు విడాకులు.. ఏఆర్ రెహమాన్ ఎమోషనల్ మెసేజ్
అత్యధిక బకాయిలు ఈ మిల్లర్లవే..
- సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని ఓ మిల్లర్ నుంచి జరిమానాతో కలుపుకొని రూ.144 కోట్లు విలువైన బియ్యం బకాయిలు తెలంగాణ పౌర సరఫరాల సంస్థకు రావాల్సి ఉంది.
- సూర్యాపేట జిల్లా ప్రగతినగర్‌లోని ఒక మిల్లర్ నుంచి జరిమానాతో కలుపుకొని రూ.129 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది.
- కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లిలోని ఒక మిల్లర్ నుంచి జరిమానాతో కలుపుకొని రూ.67 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇదే జిల్లాలోని ఒక మిల్లర్ నుంచి రూ.49.69 కోట్లు బకాయిలు రావాలి.
- నిజామాబాద్ జిల్లా కారేగావ్‌లోని ఒక మిల్లర్ నుంచి రూ.47.75 కోట్ల బకాయిలు రావాలి.
Also Read :Suicide Attack : ఉగ్రవాదుల సూసైడ్ ఎటాక్.. 10 మంది పాక్ సైనికులు మృతి
ఈ పదిమంది మాత్రమే కాదు.. తెలంగాణవ్యాప్తంగా మొత్తం 1,177 మంది మిల్లర్లు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు బకాయిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో 90 మంది మిల్లర్లు నుంచి దాదాపు రూ.290 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. దీనిపై ఇటీవలే రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాలో ఓ మిల్లర్ భారీగా బకాయిలు కట్టాల్సి ఉన్నా.. రాజకీయ పలుకుబడి కారణంగా అధికారులు అతడి జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది.