Electric Aircraft : ఎలక్ట్రిక్ విప్లవం రోడ్లకే పరిమితం కాదు.. త్వరలో ఆకాశాన్నికూడా తాకనుంది.
మొదట్లో పిస్టన్ ఇంజిన్ తో నడిచే విమానాలు ఉండేవి..
ఆ తర్వాత జెట్ విమానాలు వచ్చాయి..
త్వరలో ఎలక్ట్రిక్ విమానాలు రాబోతున్నాయి..
విమానయాన చరిత్రలో స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ కొత్త చరిత్రను లిఖించనుంది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ విమానాన్ని(Electric Aircraft) ప్రయాణానికి రెడీ చేసింది. ఈరోజు (జూన్ 2) మధ్యాహ్నం నుంచి విమానం సీట్లను విక్రయించడం కూడా ప్రారంభించింది. తొలుత 3 ఎలక్ట్రిక్ విమానాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఒక్కో దాంట్లో 30 చొప్పున మొత్తం 90 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. స్వీడన్, నార్వేలో నివసించే వారికి మాత్రమే టికెట్స్ బుకింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. స్కాండినేవియన్ దేశాల వెలుపల ఉన్న వారికి ఈ విమానాలు అందుబాటులో ఉండవు. ఈ విమానాలు ఏయే రూట్ లలో నడుస్తాయి అనేది త్వరలోనే ప్రకటించనున్నారు.
Also read : Ola Electric Scooters: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరిగిన డిమాండ్.. మే నెలలో 35,000 యూనిట్ల అమ్మకాలు
ఈ ఎలక్ట్రిక్ విమానాలకు సంబంధించిన ఒక్కో టికెట్ ధర రూ.24వేలు. వచ్చే ఐదేళ్లలో అంటే 2028 నాటికి ఈ విమానాలను పెద్ద సంఖ్యలో ప్రవేశపెట్టాలని స్కాండినేవియన్ ఎయిర్‌లైన్ యోచిస్తోంది. ఇందులో భాగంగా 2022 సెప్టెంబరులో స్కాండినేవియన్ ఎయిర్‌లైన్.. ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉత్పత్తిలో ప్రత్యేకత కలిగిన స్వీడిష్ కంపెనీ “హార్ట్ ఏరోస్పేస్ “తో ఒప్పందం కుదుర్చుకుంది. హార్ట్ ఏరోస్పేస్ కంపెనీ తాము తయారు చేసే ES-30 ఎలక్ట్రిక్ విమానాలను స్కాండినేవియన్ ఎయిర్‌లైన్ కు విక్రయించనుంది.