Site icon HashtagU Telugu

Telangana Jobs : తెలంగాణలో ఉద్యోగాలు: లెక్కలు.. నిజాలు..

Jobs In Telangana

Jobs In Telangana

By: డా. ప్రసాదమూర్తి

Jobs in Telangana :  కాంగ్రెస్ పార్టీ యువతకు ఉద్యోగ భరోసా కల్పిస్తామని వాగ్దానం చేయడమే కాదు, జాబ్ క్యాలెండర్ని కూడా రిలీజ్ చేసింది. ఇప్పటికే తెలంగాణ యువత నిరాశలో నిస్పృహలో కూరుకుపోయి ఉంది. నియామకాల విషయంలో నిజాయితీగా ప్రభుత్వం యువజనులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుందని ఆశించిన అశేష తెలంగాణ యువ లోకం (Telangana Youth) ఆశాభంగాన్ని చవిచూసింది. దీన్నే ఆసరా చేసుకుని యువతకు భరోసా పలుకుతూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. తాము అధికారం చేపట్టిన తొలి సంవత్సరంలోనే దాదాపు రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేస్తామని తమ జాబు క్యాలెండర్ ద్వారా తెలంగాణ యువజనానికి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది.

We’re Now on WhatsApp. Click to Join.

కేవలం వాగ్దానమే కాదు, తేదీలతో సహా నియామకాల వివరాలను జాబ్ క్యాలెండర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్ సర్వీసులు, ట్రాన్స్పోర్ట్, విద్యా వైద్యం వ్యవసాయం తదితర రంగాలలో మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఏయే తేదీలలో భర్తీ చేస్తారో ఆ వివరాలన్నీ ఒక ప్రకటన ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువత (Telangana Youth) ముందు ఉంచింది. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ (Telangana)లో ఏం జరిగింది, ఈ పదేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, చెబుతున్న విషయం ఏమిటి? వాస్తవాల మీద చాలా సర్వేలు జరిగాయి.

ప్రభుత్వం (Telangana Government) చెబుతున్న లెక్కలు, సర్వేలు చెబుతున్న నిజాలు:

2021లో గోడ సునీల్ నాయక్ అనే గ్రాడ్యుయేట్ యువకుడు ఉద్యోగాలు రావడం లేదన్న నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు. తమను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పోరాటం చేయమని సునీల్ తన యువజన సహోదరులకు ఆత్మహత్య ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చాడు. అంతకుముందు మురళి అనే ఉస్మానియా విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా నిరాశతో నిష్పృహతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి నేపథ్యం చాలా ఉంది. మొన్న మొన్నటి ప్రవల్లికదాకా అదే కొనసాగింది. అందుకే తెలంగాణ యువతలో అంత ఆక్రోషం అంత ఆగ్రహం వ్యక్తమవుతుంది. తాజా ఉదాహరణగా బర్రెలక్కను మనం చూపవచ్చు. ఇదంతా అలా ఉంచుదాం. అసలు ప్రభుత్వం ఉద్యోగాల గురించి ఏం చెబుతోందో చూద్దాం. బీఆర్ఎస్ నాయకులు తమ ప్రభుత్వం అత్యధిక ఉద్యోగాల నియామకాలు చేసిందని, ప్రభుత్వ రంగంలో ప్రైవేటు రంగంలో ఎన్నో ఉద్యోగాలు కల్పించామని చెప్తున్నారు.

వీరి మాటల ప్రకారం 2014 నుంచి ఇప్పటివరకు 1,60,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఐటీ రంగంలో 2018 నుంచి కల్పించిన ఉద్యోగాల సంఖ్యతో అది నాలుగు లక్షల ముప్పై వేలకు చేరిందని 2022-23లో తెలంగాణ (Telangana) తలసరి ఆదాయం మూడు లక్షలకు పైగా చేరుకుందని నాయకులు చెప్పుకుంటున్నారు. 2022 డిసెంబర్లో మంత్రి కేటీఆర్ తెలంగాణ యువతకు ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో యువకులకు ఉద్యోగాల కల్పనలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలుస్తుందని చెప్పుకొచ్చారు. 2014 నుంచి 2,25,000 ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తున్నట్టు ఇందులో 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరిగినట్టు, మిగిలినవి రిక్రూట్మెంట్ స్థాయిలో ఉన్నట్టు ఆయన చెప్పారు.

Also Read:  Revanth Reddy: ఆ 12 మందిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను, ఫిరాయింపుదారులకు రేవంత్ వార్నింగ్!

ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో రెండు లక్షల ఇరవై వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్టు, అందులో ఇప్పటివరకు అంటే 2014 నుంచి 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు ఆయన లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ఆయన తన మాటల్లో 1,60,000 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ముగిసింది అని కూడా చెప్పారు. అయితే దీనిపైన ఆర్థిక నిపుణులు, సామాజికవేత్తలు పరిశోధనలు చేసి వారు వెలువరించిన నిజాలు, లెక్కలు మరోరకంగా ఉన్నాయి.

అధికారంలో ఉన్న నాయకులు ఎవరు ఎలాంటి లెక్కలు చెప్పినా వాస్తవాలు మాత్రం మరో రకంగా ఉన్నాయి. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం తెలంగాణలో 15 నుండి 29 సంవత్సరాల మధ్యనున్న చదువుకున్న యువకులలో నిరుద్యోగం రేటు దేశవ్యాప్త యావరేజ్ కంటే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఐఏఎస్ అధికారి సిఆర్ బిశ్వాల్ నాయకత్వంలో ఏర్పడిన త్రిసభ్య వేతన సవరణ కమిషన్ 2020 డిసెంబర్లో ఒక నివేదిక సమర్పించింది. దాని ప్రకారం 2014 నుంచి తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టిఐ యాక్టివిస్ట్ కరీం అన్సారీకి టీఎస్పీఎస్సీ ఇచ్చిన జవాబులో జూలై 2015 నుంచి జనవరి 2020 మధ్య కాలంలో కమిషన్ భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 29వేల పదిహేను మాత్రమే. అప్పటినుంచి కేవలం 6,235 ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ భర్తీ చేసినట్టు తర్వాత పేపర్ లీకుల కారణంగా ఉద్యోగ నియామకాల్లో ఏర్పడిన అసందిగ్ధత, అంతరాయం తటస్థంగా కొనసాగుతోంది.

అలాగే ప్రైవేటు రంగంలో ముఖ్యంగా ఐటీ రంగంలో దాదాపు పది లక్షల యువకులు మంచి ఉద్యోగాలు చేస్తున్నారని వారు ఖరీదైన ఇళ్ళు, కార్లు కొనుక్కుని స్థిరంగా ఉన్నారని ఐటీ మినిస్టర్ కేటీఆర్ చెప్తున్నారు. అయితే ఇది కేవలం ఇటీవల జరిగిన అభివృద్ధి కాదని, ఐటీ రంగం హైదరాబాదుకి తరలివచ్చిన నాటి నుంచి జరుగుతున్న క్రమాభివృద్ధిలో భాగమేనని కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగాల నియామకాల లెక్కల విషయంలో పాలకులు చెబుతున్న నిజాలు ఒకలా ఉన్నాయి, పరిశోధకులు చెబుతున్న లెక్కలు ఒకలా ఉన్నాయి. అందుకే యువతలో ఇంత అసంతృప్తి, ఆగ్రహం నెలకొని ఉంది. ఇది ఏ రూపంలో ఎన్నికల్లో బయటపడుతుందో చూడాలి.

ఈ అసంతృప్తిని, ఈ ఆగ్రహాన్ని క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా, లేక అధికార పార్టీ నాయకులు చెబుతున్న లెక్కలు నమ్మి ప్రజలు తమ విశ్వాసాన్ని మరోసారి ప్రభుత్వంలో ఉన్న పార్టీకే కట్టబెడతారా అనే విషయాన్ని ఎదురు చూడాల్సిందే.

Also Read:  Mandava Venkateswara Rao : నిజామాబాద్ లో బీఆర్ఎస్‌కు భారీ షాక్..కాంగ్రెస్ లోకి మాజీమంత్రి

Exit mobile version