ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

విమర్శలు వెల్లువెత్తడంతో జనవరి 8న ఎలోన్ మస్క్ ఒక కీలక ప్రకటన చేశారు. గ్రోక్ ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ ఫీచర్లను కేవలం పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు (డబ్బు చెల్లించేవారికి) మాత్రమే పరిమితం చేస్తున్నట్లు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Ban On Grok

Ban On Grok

Ban On Grok: ఎలోన్ మస్క్ AI చాట్‌బాట్ ‘గ్రోక్’ ద్వారా మహిళలు, మైనర్ బాలికల అశ్లీల డీప్‌ఫేక్ చిత్రాలు (నకిలీ చిత్రాలు) సృష్టించబడుతున్నాయనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండోనేషియా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ‘గ్రోక్’ చాట్‌బాట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

నిషేధించిన మొదటి దేశంగా ఇండోనేషియా

గ్రోక్ యాప్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఇండోనేషియా నిలిచింది. ఇండోనేషియా కమ్యూనికేషన్స్- డిజిటల్ మంత్రి మ్యూట్యా హఫీద్ ఈ విషయంపై ప్రకటన చేస్తూ.. “డిజిటల్ ప్రపంచంలో పౌరుల గౌరవం, భద్రతకు ముప్పు కలిగించే ఇటువంటి కంటెంట్‌ను మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనగా ప్రభుత్వం భావిస్తోంది” అని పేర్కొన్నారు.

Also Read: బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

ఎలోన్ మస్క్ తీసుకున్న చర్యలు సరిపోవా?

విమర్శలు వెల్లువెత్తడంతో జనవరి 8న ఎలోన్ మస్క్ ఒక కీలక ప్రకటన చేశారు. గ్రోక్ ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ ఫీచర్లను కేవలం పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు (డబ్బు చెల్లించేవారికి) మాత్రమే పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ చర్య దుర్వినియోగాన్ని అరికట్టడానికి సరిపోదని నిపుణులు భావిస్తున్నారు. ఎవరైనా ఇటువంటి అభ్యంతరకర చిత్రాలను సృష్టిస్తే వారి అకౌంట్లను శాశ్వతంగా బ్యాన్ చేస్తామని ‘X’ (గతంలో ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్ వాగ్దానం చేసింది.

భారతదేశం కూడా కఠిన చర్యలకు సిద్ధం?

భారతదేశంలో కూడా ఈ వ్యవహారం ముదురుతోంది. మహిళలు, చిన్నారుల డీప్‌ఫేక్ చిత్రాల విషయంలో ఐటీ మంత్రిత్వ శాఖ xAI సంస్థను వివరణ కోరింది. అయితే కంపెనీ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని ప్రభుత్వం భావిస్తోంది. గ్రోక్ ఎలా పనిచేస్తుంది? కంటెంట్ మోడరేషన్ ఎలా చేస్తారో డెమో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ‘X’ సంస్థను కోరింది. మరోవైపు బ్రిటన్ వంటి దేశాలు కూడా ఆన్‌లైన్ సేఫ్టీ చట్టాలను ఉల్లంఘించినందుకు ‘X’ ప్లాట్‌ఫారమ్‌ను ఏకంగా నిషేధించే దిశగా ఆలోచిస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, మలేషియా వంటి దేశాలు ఇప్పటికే ఈ అంశంపై విచారణ ప్రారంభించాయి.

  Last Updated: 10 Jan 2026, 10:45 PM IST