Deep Seek AI : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) రంగంలో చైనా స్టార్టప్ కంపెనీ ‘డీప్‌సీక్’ (DeepSeek) సంచలనం క్రియేట్ చేసింది. ఇదొక ఏఐ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్. డీప్ సీక్‌కు చెందిన ‘ఆర్1’ ఏఐ మోడల్ ఇప్పుడు అమెరికాకు చెందిన ఏఐ వేదిక ఛాట్ జీపీటీని దాటేసి.. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో నంబర్ 1 స్థానాల్లో నిలిచింది. ఈ తరుణంలో డీప్ సీక్‌పై సైబర్ ఎటాక్ జరిగింది. దీని కారణంగా కొత్త యూజర్లు తమ వేదికలో దాదాపు గంట పాటు రిజిస్టర్ చేసుకోలేకపోయారని డీప్ సీక్ వెల్లడించింది. సైబర్ ఎటాక్ నేపథ్యంలో చైనా ఫోన్ నంబర్లు ఉన్న యూజర్లకు మాత్రమే ఈ కంపెనీ సైన్‌అప్ అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికే రిజిస్టర్ అయిన యూజర్లు యథావిధిగా సేవలను వాడుకోవచ్చని వెల్లడించింది.
ఏమిటీ ‘డీప్ సీక్’ ?
- డీప్‌సీక్ కంపెనీ 2023లో చైనా కేంద్రంగా ఏర్పాటైంది. దీన్ని లియాంగ్ వెన్ఫెంగ్ స్థాపించారు.
- డీప్ సీక్ ఏఐ మోడల్‌ను డీప్‌సీక్ ఆర్1 అని పిలుస్తున్నారు.
- డీప్ సీక్‌ను తయారు చేసిన టీంలో చైనాలోని ప్రముఖ యూనివర్సిటీల గ్రాడ్యుయేట్లు ఉన్నారు.
ఇతర ఏఐ మోడల్స్‌కు, డీప్ సీక్‌కు తేడా ?
డీప్‌సీక్ కచ్చితంగా స్పెషల్. ఓపెన్ఏఐకి చెందిన ఛాట్ జీపీటీ, ఇతరత్రా ప్రముఖ కంపెనీల ఏఐ మోడల్స్ కంటే ఇది విభిన్నమైంది. యూజర్లు ఇచ్చే ప్రాంప్టుకు సమాధానాన్ని ఇచ్చే ముందు రీజనింగ్ కూడా ఇవ్వడం డీప్ సీక్ ఆర్1 ప్రత్యేకత. గణితం, జనరల్ నాలెడ్జ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ పర్ఫామెన్స్‌లో డీప్ సీక్ చాలా బెటర్.
అమెరికాకు కలవరం ఎందుకు ?
ప్రపంచంలో అమెరికాతో పోటీ పడుతున్న దేశం ఏదైనా ఉందంటే అది చైనానే(Deep Seek AI). అన్ని రంగాల్లోనూ అమెరికాకు ధీటుగా చైనా తయారవుతోంది. సైన్యంపరంగా, ఆర్థికపరంగా, వాణిజ్యపరంగా, సాంకేతికపరంగా ఇలా ఏ విభాగంలో చూసినా చైనా పైచేయి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మేడిన్ చైనా ఉత్పత్తుల హవా వీస్తోంది. ఇదంతా చూసి అమెరికా కలవరానికి గురవుతోంది. ఏఐ రంగంలోనూ చైనా ముందడుగు వేస్తుండటాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. చైనాకు జీపీయూ సెమీ కండక్టర్ల వంటి హై-ఎండ్ టెక్నాలజీ చేరకుండా అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది. అయినా ఏఐ టెక్నాలజీలో కొత్త విప్లవానికి చైనా బీజాలు వేసింది. టిక్‌టాక్‌తో అమెరికా సోషల్ మీడియా మార్కెట్‌పై పట్టు సాధించిన చైనా.. ఇప్పుడు డీప్ సీక్ ద్వారా అమెరికా ఏఐ మార్కెట్‌ను కూడా గుప్పిట్లోకి తీసుకునేందుకు రెడీ అయింది. అందుకే అమెరికా తత్తరపాటుకు గురవతోంది.