Google Willow : గూగుల్.. ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ మార్కెట్‌లో తిరుగులేని రారాజు. ఈ కంపెనీ ఇప్పుడు చిప్‌ల అభివృద్ధిపైనా ఫోకస్ పెట్టింది. తాజాగా సరికొత్త క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్‌ను గూగుల్ ఆవిష్కరించింది. దాని పేరు.. విల్లో. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాంటా బార్బరాలో గూగుల్ కంపెనీకి క్వాంటమ్ టెక్నాలజీ ల్యాబ్ ఉంది. ఇందులోనే విల్లో చిప్‌ను అభివృద్ధి చేశారు. ఈ అధునాతన చిప్ గురించి కొన్ని విశేషాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
Also Read :R Krishnaiah : నేను అడగలేదు.. బీజేపీయే పిలిచి రాజ్యసభ ఛాన్స్ ఇచ్చింది : ఆర్ కృష్ణయ్య
విల్లో చిప్ విశేషాలివీ..
- విల్లో చిప్ సాధారణ కంప్యూటర్ల కంటే మెరుపు వేగంతో పనిచేస్తుంది.
- ఎలాంటి మ్యాథ్స్ సమస్యలనైనా, ఇతరత్రా లెక్కలనైనా ఈ చిప్ ఐదు నిమిషాల్లోనే(Google Willow) పరిష్కరించగలదు.
- సూపర్ కంప్యూటర్‌లు ఇదే మ్యాథ్స్ సమస్యను పరిష్కరించాలంటే 10 సెప్టిలియన్ (ఒకటి తర్వాత 25 సున్నాలు ఉండే సంఖ్య) సంవత్సరాల టైంను తీసుకుంటాయి. అంటే సూపర్ కంప్యూటర్లను తలదన్నే స్పీడ్‌తో విల్లో చిప్ పనిచేస్తుంది.
- సాధారణ కంప్యూటర్లు బైనరీ భాష ఆధారంగా పనిచేస్తాయి. బైనరీ భాష అనేది 0, 1 అనే రెండు అంకెలపై ఆధారపడి ఉంటుంది. 0 అంటే విద్యుత్ (ఎలక్ట్రాన్ల) ప్రవాహం లేకపోవడం. 1 అంటే విద్యుత్ ప్రసారం ఉండటం. 0, 1ని కలిపి బిట్ అంటారు. ప్రస్తుత కంప్యూటర్లు బైనరీ కోడ్‌లోనే సమాచారాన్ని నిల్వచేసి, ప్రాసెస్ చేస్తుంటాయి.
- క్వాంటమ్ కంప్యూటర్లు ‘క్యూ బిట్స్’ ఆధారంగా పనిచేస్తుంటాయి. క్యూబిట్ అనేది ఏకకాలంలో 0గా, 1గా ఉంటుంది. దీనివల్ల సమాచారం వేగంగా ప్రాసెస్ అవుతుంది. క్యూబిట్స్ వల్లే విల్లో చిప్ మ్యాథ్స్ సమస్యలను చాలా వేగంగా పరిష్కరిస్తుంది.
- గూగుల్ కంపెనీ విల్లో చిప్‌లో 105 క్యూబిట్స్‌ను పొందుపరిచింది.
- విల్లో చిప్‌ను ఆవిష్కరించిన విషయాన్ని గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
- విల్లో చిప్ ఆవిష్కరణపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ‘‘ఇది నిజంగా అద్భుతం’’ అని ప్రశంసలతో ముంచెత్తారు.