Neuralink : మనిషి మెదడులో చిప్ అమర్చాలనే అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కల నెరవేరేలా ఉంది. ఆయనకు చెందిన న్యూరాలింక్ కంపెనీ మరో పురోగతి సాధించింది. న్యూరాలింక్ కంపెనీ తయారు చేసిన అత్యంత సూక్ష్మమైన, చాలా పలుచటి బ్రెయిన్ చిప్‌తో రెండో ట్రయల్ విజయవంతంగా పూర్తయింది. దాన్ని గత నెలలోనే అలెక్స్ అనే వ్యక్తి మెదడులో అమర్చారు. నెల రోజుల వ్యవధిలో ఇప్పటివరకు అతడిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ బయటపడలేదని రీసెర్చ్‌లో గుర్తించారు. అలెక్స్ ప్రస్తుతం వీడియో గేమ్స్ ఆడుతుండటంతో పాటు 3డీ ఆబ్జెక్టులను డిజైన్ చేస్తున్నాడని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
అప్పటికి, ఇప్పటికి తేడా..
ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా న్యూరాలింక్(Neuralink) కంపెనీ అర్బాగ్ అనే వ్యక్తి మెదడులో చిప్‌ను అమర్చగా.. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ బయటపడ్డాయి. అప్పట్లో అర్బాగ్ మెదడులో అమర్చిన చిప్‌లోని అతి సూక్ష్మమైన వైర్లు దగ్గరికి కుచించుకుపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే అవి ముడుచుకుపోయాయి. తొలిసారి ప్రయోగ పరీక్షల్లో ఎదురైన ప్రతికూల ఫలితాల ఆధారంగా బ్రెయిన్ చిప్‌ను న్యూరాలింక్ శాస్త్రవేత్తలు మరింత డెవలప్ చేశారు. ఇప్పుడు రెండో ట్రయల్‌లో భాగంగా దాన్ని అలెక్స్ మెదడులో అమర్చగా సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈసారి బ్రెయిన్ చిప్‌కు, మెదడు ఉపరితలానికి మధ్యనున్న గ్యాప్‌ను కూడా చాలావరకు తగ్గించారు.
Also Read :Bomb Threat : ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ.. ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
పక్షవాతంపై పోరాటం
పక్షవాతం వచ్చిన రోగులు దైనందిన జీవిత కార్యకలాపాలను సాఫీగా చేసుకునేలా మెదడు నుంచి శరీర భాగాలకు సిగ్నల్స్ అందేలా చేయడమే న్యూరాలింక్ బ్రెయిన్ చింప్ లక్ష్యం. సర్జరీ ద్వారా దీన్ని మెదడులో అమరుస్తారు.తొలిసారి న్యూరాలింక్ బ్రెయిన్ చిప్‌ను అమర్చుకున్న అర్బాగ్ తనకు పక్షవాతం ఉన్నప్పటికీ.. వీడియో గేమ్స్ ఆడగలిగాడు. ఇంటర్నెట్‌ను నావిగేట్ చేయగలిగాడు. సోషల్ మీడియాలో పోస్టులు చేశాడు. ల్యాప్‌టాప్ కర్సర్‌ను కంట్రోల్ చేయగలిగాడు.
బ్రెయిన్ చిప్ ఎలా ఉంటుంది ?
న్యూరాలింక్ కంపెనీ బ్రెయిన్ చిప్ ఒక నాణెం సైజులో ఉంటుంది. దాన్ని మన పుర్రె కింద, మెదడు ఉపరితలానికి అత్యంత సమీపంలో అమరుస్తారు. ఇందులో 64 అతిసూక్ష్మ వైర్లు ఉంటాయి. మెదడులోని న్యూరాన్ల కార్యకలాపాలను కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోనుతో కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే 1,000 కంటే ఎక్కువ ఎలక్ట్రోడ్‌లు ఆ 64 అతిసూక్ష్మ వైర్లలో ఉంటాయి.2016లో న్యూరాలింక్ కంపెనీని ఎలాన్ మస్క్ స్థాపించారు.