ఏదో పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు కొత్త నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ మనకు చికాకు తెప్పిస్తుంటాయి. అవి లోన్ ఆఫర్లు, క్రెడిట్ కార్డులు, తక్కువ వడ్డీకే రుణాలు, లేదా బ్యాంకు ఖాతాలు తెరవమని చెప్పే ప్రమోషనల్ కాల్సే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి కాల్స్ మన మూడ్‌ను పాడు చేయడమే కాకుండా, కొన్నిసార్లు కాల్ చేసిన వారితో గొడవలకు కూడా దారితీస్తుంటాయి. ఇది ఒకరికో ఇద్దరికో కాదు, చాలా మందిని వేధించే సాధారణ సమస్య. నిత్యం ఇలాంటి ప్రమోషనల్, మార్కెటింగ్ కాల్స్ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. చాలా మంది వీటిని ఎలా ఆపాలో తెలియక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం లేదా ఇంకోసారి చేయవద్దని చెప్పడం చేస్తుంటారు. బ్లాక్ చేసినా, మళ్లీ వేరే నంబర్ల నుంచి కాల్స్ చేస్తూనే ఉంటాయి. అయితే, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ స్పామ్ కాల్స్‌ను కట్టడి చేయవచ్చు.
Prajwal Revanna : తక్కువ శిక్ష వేయండి.. కోర్టులో కన్నీరుమున్నీరైన ప్రజ్వల్ రేవణ్ణ
స్పామ్ కాల్స్ బారిన పడకుండా ఉండాలంటే ముందుగా చేయాల్సిన పని మీ నంబరు మీద DND (Do Not Disturb) ఆప్షన్ను ఎనేబుల్ చేయడం. దీనిని మూడు పద్ధతుల ద్వారా చేసుకోవచ్చు. మొదటిది, START 0 అని టైప్ చేసి 1909కి ఎస్ఎంఎస్ పంపడం. దీని ద్వారా అన్ని సంస్థల నుంచి వచ్చే ప్రమోషనల్ కాల్స్ ఆగిపోతాయి. అయితే, ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన ముఖ్యమైన మెసేజ్‌లు కూడా రాకపోవచ్చు. రెండవది, https://www.dndcheck.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి, అక్కడ నేషనల్ డునాట్ కాల్ రిజిస్ట్రీలో మీ నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు. అప్పటికీ కాల్స్ వస్తుంటే 1909 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మూడవది, మీ టెలికాం ప్రొవైడర్ యాప్‌లైన మై జియో, ఎయిర్‌టెల్ థ్యాంక్స్, వీఐ వంటి వాటిల్లోని DND సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ కాల్స్‌ను బ్లాక్ చేయవచ్చు.
మీరు DND సెట్టింగ్స్‌ను యాక్టివ్ చేసినా కూడా స్పామ్ కాల్స్ మిమ్మల్ని విసిగిస్తుంటే, మీ ఫోన్‌లోని కాల్ బ్లాకింగ్ ఫీచర్ను ఉపయోగించవచ్చు. ట్రూకాలర్ వంటి కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు స్పామ్ కాల్స్, బ్యాంక్ లేదా మార్కెటింగ్ కాల్స్ వంటి వాటిని గుర్తించగలవు. అలాంటి నంబర్ల నుంచి కాల్స్ వస్తే, వాటిని స్పామ్‌గా మార్క్ చేస్తే మళ్లీ అలాంటి కాల్స్ రావు. ఈ యాప్‌లు స్పామ్ నంబర్‌లను గుర్తించి, వాటిని ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే సౌలభ్యాన్ని కూడా కల్పిస్తాయి.
మీకు ఏదైనా ఒకే బ్యాంక్, ఆర్థిక సంస్థ లేదా మార్కెటింగ్ సంస్థ నుంచి తరచుగా కాల్స్ వస్తుంటే, నేరుగా ఆ సంస్థ కస్టమర్ సర్వీస్ సెంటర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ మీరు మీ ప్రిఫరెన్సెస్ (అభిరుచులు) మార్చుకోవడం ద్వారా స్పామ్, ప్రమోషనల్ కాల్స్‌ను బ్లాక్ చేయవచ్చు. అలాగే, బ్యాంక్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో లాగిన్ అయి, మీ అకౌంట్ సెట్టింగ్స్‌లో లేదా ప్రిఫరెన్సెస్ విభాగంలో అనవసరపు ఫోన్ కాల్స్‌ను నియంత్రించుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా స్పామ్ కాల్స్ బెడద నుంచి చాలా వరకు బయటపడవచ్చు.