Site icon HashtagU Telugu

Jaiswal- Pant: రిష‌బ్ పంత్‌, య‌శ‌స్వీ జైస్వాల్‌కు బీసీసీఐ బిగ్ షాక్‌?!

Jaiswal- Pant

Jaiswal- Pant

Jaiswal- Pant: ఆసియా కప్ 2025 సమీపిస్తున్న తరుణంలో భారత క్రికెట్ జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈసారి టీ20 ఫార్మాట్‌లో కొంతమంది ప్రముఖ ఆటగాళ్లకు అవకాశం లభించడం కష్టంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రిషబ్ పంత్, యశస్వీ జైస్వాల్‌కు (Jaiswal- Pant) కూడా టీ20 జట్టులో చోటు దక్కకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

టీ20 రేసులో రిషబ్ పంత్‌ను వెనక్కి నెడుతున్న సంజూ శాంసన్

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికల ప్రకారం.. భారత జట్టు మేనేజ్‌మెంట్ ఇకపై రిషబ్ పంత్‌ను టీ20 ఫార్మాట్ ప్రణాళికల్లో చేర్చడం లేదు. గత సంవత్సరం కాలంగా టీ20 జట్టులో నిలకడగా రాణిస్తున్న సంజూ శాంసన్‌పై మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టింది. సంజూ శాంసన్ టీ20 జట్టులో మొదటి ఎంపికగా నిలుస్తున్నాడు. రెండవ ఎంపికగా జితేష్ శర్మ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ కారణంగా టీమ్ ఇండియా తరఫున 76 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రిషబ్ పంత్‌కు ఈసారి అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. పంత్ తన కెరీర్‌లో 66 ఇన్నింగ్స్‌లలో 1209 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ శతకాలు ఉన్నాయి.

Also Read: Cristiano Ronaldo: తొమ్మిదేళ్ల తర్వాత ప్రేయ‌సిని నిశ్చితార్థం చేసుకున్న రొనాల్డో!

యశస్వీ జైస్వాల్‌కు పోటీగా అభిషేక్ శర్మ

రిషబ్ పంత్ మాదిరిగానే యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌కు కూడా టీ20 ఫార్మాట్‌లో అవకాశాలు తగ్గుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మరో యువ ఆటగాడు అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శన. అభిషేక్ శర్మ ప్రస్తుతం నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మకు ఓపెనర్‌గా జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో 23 టీ20 మ్యాచ్‌లలో 723 పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్‌కు ప్రస్తుతం జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. జైస్వాల్ తన కెరీర్‌లో ఒక శతకం, ఐదు అర్ధ శతకాలు సాధించాడు.

టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు, భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా యువ ప్రతిభావంతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఆసియా కప్‌లో తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version