Site icon HashtagU Telugu

WTC 2025-27 Points Table: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ స‌మం.. డ‌బ్ల్యూటీసీలో టీమిండియాకు లాభం!

WTC 2025-27 Points Table

WTC 2025-27 Points Table

WTC 2025-27 Points Table: లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ జట్టు ఇంగ్లండ్‌పై 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజయంతో ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది. ఈ విజయానికి ప్రధాన కారణం పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్. అతని సూప‌ర్ బౌలింగ్ చివరి రోజు మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేసింది.

సిరాజ్ విధ్వంసం, భారత్ విజయం

ఐదవ రోజు ఆట ప్రారంభమైనప్పుడు ఇంగ్లండ్‌కు విజయానికి కేవలం 35 పరుగులు మాత్రమే అవసరం. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. అయితే మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల జోడీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేసింది. సిరాజ్ తన కచ్చితమైన బౌలింగ్‌తో ఐదవ రోజు మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు.

ముందుగా జేమీ స్మిత్‌ను పెవిలియన్‌కు పంపిన సిరాజ్, ఆ తర్వాత జేమీ ఓవర్టన్‌ను 9 పరుగుల వద్ద ఔట్ చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా జోష్ టంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లాండ్‌కు తొమ్మిదో వికెట్‌ దెబ్బ కొట్టాడు. చివరి వికెట్‌గా క్రీజ్‌లో నిలదొక్కుకుంటున్న గస్ ఆట్కిన్సన్‌ను సిరాజ్ ఒక అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తం 9 వికెట్లు పడగొట్టి, తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అతని ఈ ప్రదర్శనతో భారత్ జట్టు ఓటమి అంచు నుంచి బయటపడి సిరీస్‌ను సమం చేయగలిగింది.

Also Read: Free Bus Travel: గుడ్ న్యూస్‌.. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం!

WTC పట్టికలో భారత్ దూకుడు

ఈ విజయం టీమ్ ఇండియాకు కేవలం సిరీస్‌ను సమం చేయడమే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27 Points Table) పాయింట్ల పట్టికలో కూడా గణనీయమైన ప్రయోజనాన్ని చేకూర్చింది. ఈ విజయంతో భారత్ WTC పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరుకుంది. భారత జట్టు విజయ శాతం ఇప్పుడు 46.67కి పెరిగింది. మరోవైపు, ఈ ఓటమితో ఇంగ్లండ్ జట్టు భారీ నష్టాన్ని చవిచూసింది. ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానానికి పడిపోయింది.

శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని యువ భారత జట్టు ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో సాధించిన ఈ విజయం భవిష్యత్తులో జట్టుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిరాజ్ వంటి యువ బౌలర్ల ప్రదర్శన జట్టుకు కొత్త శక్తినిచ్చింది. ఈ విజయం భారత క్రికెట్ అభిమానులకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా, WTC ఫైనల్ రేసులో భారత్ అవకాశాలను మరింత మెరుగుపరిచింది.