WPL 2026 Prize Money: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026లో మరోసారి కొత్త ఛాంపియన్ కాకుండా పాత విజేతకే పట్టం దక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, ట్రోఫీతో పాటు భారీ ప్రైజ్ మనీని కూడా తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది. ఫైనల్ వరకు చేరుకున్నా ట్రోఫీ మాత్రం చేజారిపోయింది.
WPL 2026 ప్రైజ్ మనీ జాబితా
విజేత: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) – 6 కోట్ల రూపాయలు
రన్నరప్: ఢిల్లీ క్యాపిటల్స్ (DC)- 3 కోట్ల రూపాయలు
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: సోఫీ డివైన్- 5 లక్షల రూపాయలు
ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు): స్మృతి మంధాన- 5 లక్షల రూపాయలు
పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు): సోఫీ డివైన్- 5 లక్షల రూపాయలు
టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు: సోఫీ డివైన్- 5 లక్షల రూపాయలు
బెస్ట్ స్ట్రైక్ రేట్ అవార్డు: గ్రేస్ హారిస్- 5 లక్షల రూపాయలు
ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: స్మృతి మంధాన- 2.5 లక్షల రూపాయలు
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: నందిని శర్మ- 5 లక్షల రూపాయలు
Also Read: మహిళలకు శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.
ఫైనల్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (20), లిజెల్ లీ (37) జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కానీ మిడిల్ ఓవర్లలో వికెట్లు పడటంతో పరుగుల వేగం కొంచెం తగ్గింది. అయినప్పటికీ జెమిమా రోడ్రిగ్స్ (57) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును పటిష్ట స్థితికి చేర్చింది. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు రావడంతో ఢిల్లీ భారీ స్కోరును నమోదు చేయగలిగింది. ఫైనల్ ఒత్తిడిలో ఇది అంత సులభమైన లక్ష్యం కాదు.
స్మృతి, వోల్ మలుపు తిప్పారు
లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆర్సీబీకి గ్రేస్ హారిస్ (9) రూపంలో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆ తర్వాత కెప్టెన్ స్మృతి మంధాన బాధ్యత తీసుకుంది. ఆమెతో కలిసి జార్జియా వోల్ (79) భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఢిల్లీ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. వీరిద్దరూ రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్త పడుతూ మ్యాచ్‌ను పూర్తిగా ఆర్సీబీ వైపు తిప్పారు. చివరి ఓవర్లలో కొన్ని వికెట్లు పడినా జట్టు సంయమనం కోల్పోకుండా 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.
ఢిల్లీకి నాలుగో ఫైనల్.. నాలుగోసారి నిరాశే
ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ ఆడటం ఇది వరుసగా నాలుగోసారి. కానీ టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది. ప్రతి సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ నిర్ణయాత్మక మ్యాచ్‌లో తడబడటం ఢిల్లీకి అతిపెద్ద సమస్యగా మారుతోంది. ఈ ఓటమి కేవలం ఆటగాళ్లకే కాకుండా ఫ్రాంచైజీకి, అభిమానులకు కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది.
