Women’s World Boxing Championship: నలుగురి పంచ్ బంగారమాయె

మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్లు అదరగొట్టారు. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకున్నారు.

  • Written By:
  • Updated On - March 26, 2023 / 10:39 PM IST

Women’s World Boxing Championship : మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్లు అదరగొట్టారు. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. ఊహించినట్టుగానే ఫైనల్స్ కు చేరిన నలుగురు భారత బాక్సర్లూ ఛాంపియన్స్ గా నిలిచారు. శనివారం నీతూ గంగాస్, స్వీటీ బూరా పసిడి పంచ్ లు విసిరితే తాజాగా తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, మరో బాక్సర్ లవ్లీనా కూడా బంగారు పతకాలు సాధించారు. 75 కిలోల విభాగంలో లవ్లీనా బోర్గోహెయిన్‌ స్వర్ణాన్ని గెలిచింది.

లవ్లీనా ఆస్ట్రేలియాకు చెందిన కైత్లిన్‌ పార్కర్‌పై 5-2 తేడాతో విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన లవ్లీనా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ లో మెడల్ సాధించడం ఇదే తొలిసారి. అంతకుముందు నిఖత్ జరీన్ 50 కిలోల విభాగంలో ఛాంపియన్ గా నిలిచింది. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో రెండోసారి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. తద్వారా వరుసగా రెండుసార్లు స్వర్ణం గెలిచిన బాక్సర్ గా రికార్డులెక్కింది. అలాగే మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన బాక్సర్ గా ఘనత సాధించింది.

శనివారం నీతూ గంగాస్ 48 కేజీల విభాగంలో మంగోలియన్ ప్లేయర్‌పై గెలిసి బంగారు పతకం కైవసం చేసుకుంది. మరోవైపు 81 కేజీల విభాగంలో స్వీటీ బూరా గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దీంతో మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ 4 స్వర్ణాలు గెలిచినట్లయింది.

Also Read:  World Women’s Boxing Championship : నీతూ, స్వీటీ పసిడి పంచ్