Site icon HashtagU Telugu

Women’s T20 World Cup: కంగారూలతో భారత్‌ ”సెమీతుమీ”..!

T20 World Cup

Resizeimagesize (1280 X 720) 11zon

మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్‌లో (Women’s T20 World Cup) తొలి సెమీస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. టైటిల్ రేసులో ఉన్న భారత్, పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. ఈ టోర్నీలో మంచి ప్రదర్శనే కనబరుస్తున్నప్పటకీ కంగారూలకు చెక్ పెట్టాలంటే హర్మన్‌ప్రీత్‌ అండ్ కో అంచనాలకు మించి రాణించాల్సిందే. మరోవైపు టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఆసీస్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ నాకౌట్ స్టేజ్‌కు చేరింది.

గ్రూప్‌- A నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా.. గ్రూప్- B నుంచి ఇంగ్లాండ్‌, టీమ్‌ఇండియా సెమీస్‌ చేరుకోగా.. ఇవాళ జరిగే తొలి సెమీస్‌లో ఆసీస్-భారత్ తలపడనున్నాయి. మహిళల క్రికెట్‌లోనూ ఆస్ట్రేలియా ఎంత బలమైన జట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో కంగారూలను ఓడించాలంటే హర్మన్‌ప్రీత్‌కౌర్ సారథ్యంలోని టీమిండియా అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో సెమీస్ చేరినప్పటకీ భారత్‌ను కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. టాపార్డర్‌ నిలకడ లేమి, స్పిన్నర్ల వైఫల్యం ఆందోళన కలిగిస్తున్నాయి.

స్మృతీ మంధాన, హర్మన్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. కీలకమైన సమయంలో చేతులెత్తేయడం ఒక్కోసారి భారత్‌కు వీక్‌నెస్‌గా మారింది. షెఫాలీ వర్మ మెరుపులు అంతగా కనిపించడం లేదు. అలాగే స్మృతి మంధానపై భారత్ ఎక్కువగా ఆధారపడుతోంది. బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తే భారీస్కోరు సాధించొచ్చు. అటు బౌలింగ్‌లో పేసర్లు రాణిస్తున్నా… స్పిన్నర్లు మాత్రం నిరాశపరుస్తున్నారు. సఫారీ పిచ్‌లపై ఇతర దేశాల స్పిన్నర్లు అదరగొడుతుంటే.. మన స్పిన్నర్లు మాత్రం నిలకడైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. ఆసీస్‌ను స్పిన్ మంత్రంతోనే కట్టడి చేస్తే విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు.

Also Read: Ben Stokes: చెన్నై సూపర్ కింగ్స్ కి షాకివ్వనున్న బెన్ స్టోక్స్

మరోవైపు టైటిల్ ఫేవరెట్లలో ముందున్న ఆస్ట్రేలియా తమ స్థాయికి తగినట్టే ఆడుతోంది. ఇప్పటి వరకూ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్‌లో అడుగుపెట్టింది. దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ భారీ విజయాలను అందుకున్న కంగారూలు అన్ని విభాగాల్లో మంచి ఫామ్ కనబరుస్తున్నారు. అలీ హీలేతోపాటు బెత్‌ మూనీ, కెప్టెన్ మెగ్‌ లానింగ్‌, ఆష్లే గార్డెనర్‌, పెర్రీ, తహిలా మెక్‌గ్రాత్‌ వంటి టాప్‌ ప్లేయర్లు ఆసీస్‌కు ప్రధాన బలం. ఇదిలా ఉంటే గత రికార్డుల పరంగా ఆస్ట్రేలియాదే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు 30 టీట్వంటీల్లో తలపడగా.. ఆసీస్ 22 మ్యాచ్‌లలో గెలిచింది. భారత్ కేవలం ఏడు మ్యాచుల్లోనే విజయం సాధించింది. గత ఐదు మ్యాచ్‌లలో టీమిండియా ఒక్కటే గెలిచింది. మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న కేప్‌టౌన్‌ పిచ్‌పై కనీసం 170 పరుగుల పైన స్కోర్ చేస్తే ఆసీస్‌కు గట్టిపోటీ ఇచ్చే అవకాశముంటుంది.

భారత తుది జట్టు అంచనా: హర్మన్‌ ప్రీత్‌ కౌర్ (కెప్టెన్), స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, రిచా ఘోష్‌, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, రాధా యాదవ్‌, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, రేణుకా సింగ్‌

ఆస్ట్రేలియా తుది జట్టు అంచనా: మెగ్ లానింగ్‌ (కెప్టెన్), బెత్ మూనీ, ఎలీసా హీలే, ఆష్లే గార్డెనర్, ఎలీస్ పెర్రీ, తహిలా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్‌, జార్షియా వారెహమ్, అలానా కింగ్‌, మెగన్ స్కట్, డార్సీ బ్రౌన్