Site icon HashtagU Telugu

Virat Kohli: ఆస్ట్రేలియాతో మరో మూడు రికార్డుల భరతం పట్టడానికి రెడీ..

Willing To Break Three More Records With Australia Virat Kohli

Willing To Break Three More Records With Australia Virat Kohli

టెస్టు, వన్డే క్రికెట్‌లో వరుసగా సిరీస్‌లు గెలుస్తున్న ఇండియన్ క్రికెట్ టీమ్, మరో సమరానికి సిద్ధమైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న రోహిత్ సేన, రేపటి నుంచి (మార్చి 17) ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది. శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫస్ట్ వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఇటీవల వన్డేల్లో సూపర్ ఫామ్‌ను అందుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli), ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా సక్సెస్ అయ్యాడు. దీంతో తాజా వన్డే సిరీస్‌లో ఈ రన్ మెషిన్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో కోహ్లీ మూడు రికార్డులను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

వన్డేల్లో 13వేల పరుగులు: 

వన్డేలో మునుపటి ఫామ్‌ అందుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli), పరుగుల విషయంలో మరో రికార్డుకు చేరువయ్యాడు. ఇంటర్నేషనల్ వన్డేల్లో 13,000 పరుగుల మైలురాయి చేరుకోవడానికి ఈ స్టార్ బ్యాటర్ 191 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ కేవలం 262 ఇన్నింగ్స్‌ల్లోనే వన్డేల్లో 12,809 పరుగులు చేశాడు. 13వేల పరుగులు సాధించిన రెండో ఇండియన్ క్రికెటర్‌గా, ఐదో ఆటగాడిగా నిలవడానికి విరాట్ రెడీ అవుతున్నాడు. అంతేకాదు ఈ సిరీస్‌లో కోహ్లీ 13,000 పరుగుల మార్క్ అందుకుంటే, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 321 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును అందుకున్నాడు.

ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సెంచరీలు: 

విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 75 సెంచరీలు కొట్టాడు. వీటిలో 16 ఆస్ట్రేలియాపై నమోదు చేశాడు. వన్డేల్లో కింగ్ కోహ్లీ కంగారూలపై ఎనిమిది సెంచరీలు సాధించాడు. తాజా సిరీస్‌లో మరో సెంచరీ చేస్తే.. ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సెంచరీలు కొట్టిన సచిన్ టెండూల్కర్ (9) రికార్డును కోహ్లీ సమం చేస్తాడు. ఈ సిరీస్‌లో విరాట్ రెండు సెంచరీలు బాదితే, సచిన్‌ను అధిగమించవచ్చు.

ఆసీస్‌పై రెండో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు: 

బోర్డర్ – గవాస్కర్ సిరీస్ చివరి టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 186 పరుగులు చేశాడు. ఈ భారీ స్కోర్‌తో అతడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియాపై కోహ్లీకి ఇది తొమ్మిదో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.

రేపటి నుంచి జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ కనీసం మరో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుంటే.. ఆస్ట్రేలియాపై ఎక్కువ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలుస్తాడు. ఆసీస్‌పై 17 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో సచిన్ టెండూల్కర్ ఈ లిస్టులో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. సర్ వివ్ రిచర్డ్స్, ఇయాన్ బోథమ్ ఇద్దరూ తమ కెరీర్‌లో ఆస్ట్రేలియాపై 10 అవార్డులు అందుకున్నారు.

Also Read:  Samsung Fake Moon Shots: శాంసంగ్‌ ఫేక్ మూన్ షాట్స్.. ఏమిటి? శాంసంగ్ ఏం చెప్పింది?