LSG vs GT: నేడు హోరాహోరీ మ్యాచ్.. గుజరాత్ పై లక్నో బదులు తీర్చుకునేనా..?

ఐపీఎల్‌ (IPL)లో శనివారం (ఏప్రిల్ 22) జరగనున్న తొలి మ్యాచ్‌లో గుజరాత్, లక్నో (LSG vs GT) జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది.

  • Written By:
  • Publish Date - April 22, 2023 / 10:21 AM IST

ఐపీఎల్‌ (IPL)లో శనివారం (ఏప్రిల్ 22) జరగనున్న తొలి మ్యాచ్‌లో గుజరాత్, లక్నో (LSG vs GT) జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు గత ఐపీఎల్ సీజన్ నుండి ఇప్పటి వరకు తమ తమ జట్లకు కెప్టెన్‌లుగా అద్భుతంగారాణిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో నేడు ఇరు జట్ల మధ్య పోటీని చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఈసారి పాయింట్ల పట్టికలో టాప్-4లో గుజరాత్ కూడా ఉంది. మరోవైపు, కెఎల్ రాహుల్ తన కెప్టెన్సీలో గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. ఈసారి కూడా అతని జట్టు పటిష్టంగా రాణిస్తూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

గుజరాత్, లక్నో జట్లు సమానంగా పోటీపడుతున్నాయి. అయితే గత సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో గుజరాత్ విజయం సాధించింది. ఐపీఎల్ 2022లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ గుజరాత్ లక్నోను ఓడించింది. ఈసారి లక్నో జట్టు ఏ విషయంలోనూ గుజరాత్ కంటే తక్కువ కాదు.

ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కాస్త బలహీనంగా ఉంది. బ్యాటింగ్‌లో ఈ జట్టు శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాపై ఎక్కువగా ఆధారపడి ఉంది. విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్ కొన్ని సందర్భాల్లో రాణిస్తున్నారు. బౌలింగ్‌లో ఈ జట్టు చాలా బలంగా ఉంది. ఫాస్ట్, స్పిన్ బౌలర్ల మధ్య మంచి సమతుల్యత ఉంది. మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు.

Also Read: IPL 2023 Playoffs : చెన్నై లో క్వాలిఫైయర్.. అహ్మదాబాద్ లో ఫైనల్

లక్నో సూపర్ జెయింట్స్‌కి చెందిన బ్యాట్స్‌మెన్‌లు వేర్వేరు మ్యాచ్‌లలో తమను తాము నిరూపించుకున్నారు. కొన్ని మ్యాచ్‌లలో కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్ విధ్వంసం సృష్టించారు. కొన్నిసార్లు నికోలస్ పూరన్, KL రాహుల్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆయుష్ బదౌనీ, కృనాల్ పాండ్యా కూడా తమ పని తాము బాగానే చేస్తున్నారు. ఈ జట్టులో మంచి బౌలర్లకు కొదవలేదు. ఫాస్ట్ బౌలర్‌లో ఈ జట్టు మార్క్ వుడ్, నవీన్ ఉల్ హక్, యుధ్వీర్ సింగ్, అవేష్ ఖాన్ వంటి ఎంపికలను కలిగి ఉండగా, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా స్పిన్ విభాగంలో ఉన్నారు.

ఓవరాల్‌గా రెండు జట్లు సమవుజ్జీగా ఉన్నాయి. అయితే బ్యాటింగ్ పరంగా గుజరాత్ పై లక్నో జట్టు కాస్త ఆధిపత్యం చెలాయించేలా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జరిగే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ గుజరాత్‌పై తన జట్టుకు విజయపథం చూపే అవకాశం ఉంది.