IPL Final: కౌన్ బనేగా ఛాంపియన్.. టైటిల్ పోరుకు గుజరాత్, చెన్నై రెడీ..!

డిఫెండింగ్ ఛాంపియన్స్ వర్సెస్ మాజీ ఛాంపియన్స్‌.. అహ్మదాబాద్ వేదికగా హైవోల్టేజ్ ఫైనల్‌ (IPL Final)కు కౌంట్‌డౌన్ మొదలైంది.

  • Written By:
  • Publish Date - May 28, 2023 / 08:15 AM IST

IPL Final: డిఫెండింగ్ ఛాంపియన్స్ వర్సెస్ మాజీ ఛాంపియన్స్‌.. అహ్మదాబాద్ వేదికగా హైవోల్టేజ్ ఫైనల్‌ (IPL Final)కు కౌంట్‌డౌన్ మొదలైంది. సీజన్‌లో నిలకడగా రాణించిన రెండు జట్ల మధ్య టైటిల్ ఫైట్ జరగబోతోంది. ఫామ్, బలాబలాల పరంగా ఎవ్వరినీ తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. బ్యాటింగ్‌కు అనుకూలించే అహ్మదాబాద్ పిచ్‌పై ఈ మెగా ఫైనల్ అభిమానులకు ఫుల్ కిక్ ఇవ్వడం ఖాయం.. మరి పరుగుల వరదలో పై చేయి సాధించేది ఎవరు..?

ఎనిమిది వారాలుగా క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ 16వ సీజన్ ముగింపు దశకు చేరింది. పలు ట్విస్టులు.. అనూహ్య ఫలితాలు.. ఉత్కంఠభరిత మ్యాచ్‌ల తర్వాత ఫైనల్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ సమరానికి సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్‌లో ఎవ్వరినీ ఫేవరెట్‌గా చెప్పలేం. బలాబలాల్లోనూ, ఫామ్‌ పరంగానూ రెండు జట్లూ సమఉజ్జీలే. హోదాకు తగ్గట్టుగానే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ సీజన్ ఆరంభం నుంచీ అదరగొడుతోంది. అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ వరుస విజయాలతో అందరి కంటే ముందే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న గుజరాత్‌కు ఓపెనర్ శుభమన్ గిల్ ఫామ్ అతిపెద్ద అడ్వాంటేజ్‌.

Also Read: IPL Final 2023: టైటిల్ కాపాడుకోవడంపై హార్దిక్…

ఏకంగా సీజ్‌లో మూడు సెంచరీలతో చెలరేగిన గిల్‌ తుదిపోరులో రెచ్చిపోతే గుజరాత్‌కు తిరుగుండదు. మిగిలిన బ్యాటింగ్ లైనప్‌లో సాహా, విజయ్ శంకర్, పాండ్యా , మిల్లర్‌లపై అంచనాలున్నాయి. ఇక బౌలింగ్‌లోనూ గుజరాత్ అదరగొడుతోంది. సీజన్‌లో అత్యధిక వికెట్ల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నది ఆ జట్టు బౌలర్లే. మహ్మద్ షమీ టాప్ ప్లేస్‌లో ఉండగా.. రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. డెత్ ఓవర్స్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో గుజరాత్ పేస్ ఎటాక్ సక్సెస్ అవుతోంది.

మరోవైపు గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన చెన్నై ఈ సారి ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చింది. ఎప్పటిలానే ధోనీ కూల్ కెప్టెన్సీ చెన్నై విజయాల్లో కీలకంగా మారిపోయింది. క్వాలిఫైయిర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. చెన్నైకి కూడా ఓపెనర్ల ఫామ్‌ బలంగా చెప్పొచ్చు. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాలనిస్తుండగా.. తర్వాత రహానే, శివమ్ దూబే, జడేజా, ధోనీలతో బలంగా ఉంది. ఇక బౌలింగ్‌లో సీనియర్లు లేకున్నా.. యువపేసర్లను అద్భుతంగా వినియోగించుకుంటూ జట్టును గెలిపిస్తున్నాడు ధోనీ. తుషార్ దేశ్ పాండే, పతిరణ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ రాటుదేలారు. తీక్షణ, జడేజా స్పిన్ మ్యాజిక్ కూడా మరోసారి రిపీట్ అయితే చెన్నై ఐదోసారి టైటిల్ అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు. అయితే శుభ్‌మన్ గిల్‌ను అడ్డుకుంటేనే చెన్నైకి టైటిల్ గెలిచే ఛాన్సుంటుంది. ఈ నేపథ్యంలో చెన్నై బౌలర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే గత రికార్డుల పరంగా గుజరాత్ దే పై చేయిగా ఉంది. ఇక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఫైనల్ కావడంతో ఛేజింగ్‌ సమయంలో ఒత్తిడిని తట్టుకోవడం కంటే టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ వైపే మొగ్గుచూపొచ్చు.