FIFA World Cup 2022: సాకర్ రారాజు ఎవరో..?

సాకర్ (soccer) ప్రపంచానికి రారాజు ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. వరుసగా రెండసారి కప్ గెలిచేందుకు ఫ్రాన్స్ ఉవ్విళ్ళూరుతుంటే.. సుధీర్ఘ విరామం తర్వాత వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచేందుకు అర్జెంటీనా ఎదురుచూస్తోంది. తన కెరీర్‌లో అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచకప్‌ (FIFA World Cup)ను గెలిచి ఘనంగా

  • Written By:
  • Publish Date - December 18, 2022 / 06:36 AM IST

సాకర్ (soccer) ప్రపంచానికి రారాజు ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. వరుసగా రెండసారి కప్ గెలిచేందుకు ఫ్రాన్స్ ఉవ్విళ్ళూరుతుంటే.. సుధీర్ఘ విరామం తర్వాత వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచేందుకు అర్జెంటీనా ఎదురుచూస్తోంది. తన కెరీర్‌లో అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచకప్‌ (FIFA World Cup)ను గెలిచి ఘనంగా వీడ్కోలు పలికేందుకు మెస్సీ సిద్ధమవుతున్నాడు. బలాబలాల పరంగా ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

నాలుగు వారాలుగా అభిమానులను అలరిస్తున్న సాకర్ ప్రపంచకప్‌ ముగింపు దశకు వచ్చేసింది. సంచలనాలతో ఆరంభమై.. అనూహ్య ఫలితాలతో సాకర్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చిన ఈ వరల్డ్‌కప్ ఫైనల్లోనూ రసవత్తర పోరు అలరించబోతోంది. అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ ఫైనల్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్, టైటిల్ ఫేవరెట్‌ అర్జెంటీనా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీ హాట్ ఫేవరెట్స్‌లో ఒకటైన అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓడిపోవడం పెద్ద షాకే. ఈ ఓటమి నుంచి త్వరగానే కోలుకున్న ఆ జట్టు వరుస విజయాలతో పుంజుకుంది. కీలక మ్యాచ్‌లలో జూలు విదిల్చి ఫైనల్ చేరింది.

అర్జెంటీనా ఫైనల్‌కు చేరుకునే క్రమంలో మెక్సీకో , పోలండ్ , ఆస్ట్రేలియాలపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌నూ, సెమీస్‌లో క్రొయేషియాను నిలువరించింది. ఈ విజయాల్లో స్టార్ ప్లేయర్ లైనోల్ మెస్సీ ఫామ్ అర్జెంటీనాకు పెద్ద అడ్వాంటేజ్‌. మెస్సీకి ఇదే చివరి ప్రపంచకప్ కానుండడంతో వరల్డ్ కప్‌ గెలిచి కెరీర్‌ను ఘనంగా ముగించాలని ఎదురుచూస్తున్నాడు. ఫైనల్లో మెస్సీపైనే ఆశలు పెట్టుకున్న అర్జెంటీనాకు అతని గాయం ఆందోళన కలిగించేదే. అయితే చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో గాయంతోనే ఆడాలని మెస్సీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Also Read: India 1st Test: విజయానికి చేరువలో భారత్‌

మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో తమపై ఉన్న అంచనాలను నిలుపుకుంది ఫ్రాన్స్‌. తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాపై 4-1 తో ఘనవిజయం సాధించి టైటిల్ వేటను ఘనంగా మొదలుపెట్టింది. తర్వాత డెన్మార్క్‌పై గెలిచిన ఆ జట్టు ట్యూనీషియా చేతిలో ఓడిపోవడం షాకే. అయితే ప్రీక్వార్టర్స్‌లో పోలండ్‌ , క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను నిలువరించింది. ఇక సెమీస్‌లో మొరాకోను చిత్తుగా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలనుకుంటున్న ఫ్రాన్స్‌కు ఎంబపే కీలకం కానున్నాడు. కాగా ఇద్దరు డిఫెండర్లు, మరో ముగ్గురు ఆటగాళ్ళు జ్వరంతో బాధపడుతుండడం ఫ్రాన్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. మ్యాచ్ ఆరంభ సమయానికి వారు కోలుకుంటారని టీమ్ మేనేజ్‌మెంట్ చెబుతోంది. ఇదిలా ఉంటే గత రికార్డుల పరంగా అర్జెంటీనాదే పైచేయిగా ఉంది. ఫామ్ పరంగానూ, బలాబలాల పరంగానూ ఇరు జట్లూ నువ్వా నేనా అన్నట్టు కనిపిస్తుండడంతో అభిమానులకు రసవత్తర పోరు ఖాయమని చెప్పొచ్చు.