Retirement: 15 ఆగస్టు 1947న భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం పొందింది. ఈ రోజును ప్రతి సంవత్సరం మనం స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే క్రికెట్ అభిమానులకు 15 ఆగస్టు 2020 ఒక ప్రత్యేక జ్ఞాపకం. ఆ రోజు భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త శకం ముగిసింది. లెజెండరీ క్రికెటర్ ఎం.ఎస్. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు (Retirement) పలికారు. ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించిన పోస్ట్‌లో 19:29 సమయాన్ని ప్రస్తావించారు. ఈ సమయం వెనుక ఉన్న కారణాలు ఇప్పటికీ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉన్నాయి.
19:29 సమయం వెనుక ఉన్న కారణాలు
ధోనీ తన రిటైర్మెంట్‌ను సాయంత్రం 7:29 గంటలకు (మిలిటరీ సమయం ప్రకారం 19:29) ప్రకటించారు. ఈ సమయం ఎంపిక వెనుక అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ధోనీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా భావించేది 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్‌నే. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. నివేదికల ప్రకారం.. ఆ మ్యాచ్ సాయంత్రం 7:26 గంటలకు ముగిసింది. ధోనీ మైదానం నుండి బయటకు వచ్చిన సమయం 7:29 గంటలకు దగ్గరగా ఉండవచ్చని, అందుకే ఆ సమయాన్ని ఆయన గుర్తుంచుకుని ఉండవచ్చని చాలామంది నమ్ముతారు.
2020 ఆగస్టు 15న భారతదేశంలో సూర్యాస్తమయం రాత్రి 7:29 గంటలకు జరిగిందని, అందుకే ధోనీ ఆ సమయాన్ని ఎంచుకున్నాడని మరో అభిప్రాయం. తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకడాన్ని సూర్యాస్తమయంతో పోలుస్తూ ఆ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించి ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా ఆయన తన పోస్ట్‌లో మిలిటరీ శైలిలో 19:29 అని పేర్కొనడం, సైన్యంపై ఆయనకు ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది.
సురేష్ రైనా రిటైర్మెంట్
ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆయనతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపులో ఉన్న మరో ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ధోనీ తన రిటైర్మెంట్ పోస్ట్‌లో “మీ ప్రేమ, మద్దతుకు చాలా ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నన్ను రిటైర్డ్‌గా భావించండి” అని రాశారు. ఆ సమయంలో రైనా, ధోనీతో పాటు సీఎస్‌కే జట్టు ఆటగాళ్లందరూ దుబాయ్‌కు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. రిటైర్మెంట్ సమయంలో ధోనీ వయస్సు 39 సంవత్సరాలు కాగా, రైనా వయస్సు 33 సంవత్సరాలు. ప్రస్తుతం ధోనీకి 44, రైనాకి 38 సంవత్సరాలు. వీరిద్దరి రిటైర్మెంట్ ప్రకటనలు ఒకే రోజు రావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.