Site icon HashtagU Telugu

Gambhir : ఆ తప్పిదాలే కొంపముంచాయి బెడిసికొట్టిన గంభీర్ ప్లాన్స్

Team India Coach

Team India Coach

కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో శ్రీలంక పర్యటన భారత్ కు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. టీ ట్వంటీ సిరీస్ లో దుమ్మురేపిన టీమిండియా వన్డే సిరీస్ లో మాత్రం తేలిపోయింది. ఊహించని విధంగా రెండు మ్యాచ్ లు ఓడిపోయి 27 ఏళ్ళ తర్వాత సిరీస్ ను చేజార్చుకుంది. నిజానికి ఈ సిరీస్ ఓటమి భారత్ కు షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే సీనియర్ బ్యాటర్లు జట్టులో ఉండి కూడా బ్యాటింగ్ వైఫల్యంతోనే చిత్తుగా ఓడిపోయింది. మరీ ముఖ్యంగా లంక జట్టులో పలువురు కీలక ఆటగాళ్ళు లేకున్నా యువ ఆటగాళ్ళు అద్భుత ప్రదర్శనతో సత్తా చాటారు. అయితే ఈ సిరీస్ కు రోహిత్ , కోహ్లీ అందుబాటులో ఉంటారని ఎవ్వరూ అనుకోలేదు. బీసీసీఐ నుంచి పర్మిషన్ తీసుకుని రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. అయితే గంభీర్ కోచ్ గా బాధ్యతలు అందుకోగానే కోహ్లీ, రోహిత్ లను లంకతో సిరీస్ ఆడాలని కోరాడు. వారిద్దరూ జట్టులోకి వచ్చినా, శ్రేయాస్ అయ్యర్ , కెెఎల్ రాహుల్ కూడా రీఎంట్రీ ఇచ్చినా కూడా ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

నిజానికి జట్టు ఎంపికలో గంభీర్ వ్యూహాలు బెడిసికొట్టాయని పలువురు విశ్లేషిస్తున్నారు. రవీంద్ర జడేజాను పక్కన పెట్టడం, సంజూ శాంసన్, రవి బిష్ణోయ్ లను ఎంపిక చేయకపోవడం ప్రభావం చూపించిందన్నది కొందరి మాట. ఎందుకంటే జట్టులో మోస్ట్ సీనియర్ స్పిన్ ఆల్ రౌండర్ గా ఉన్న జడ్డూకు, అలాగే యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కు లంక పిచ్ లు సరిగ్గా సరిపోతాయి. అలాంటిది పిచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయకుండా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లనే ఎంపిక చేశారు. కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నప్పటకీ… జడేజా, బిష్ణోయ్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదనేది పలువురి అంచనా. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు కూడా బెడిసికొట్టాయి. అక్షర్ పటేల్ ను ముందు పంపించడం, శివమ్ దూబేను ఫినిషర్ గా ఉపయోగించుకోలేకపోవడం మైనస్ గా మారింది. చివర్లో హిట్టింగ్ చేసే దూబేను నాలుగో స్థానంలో దింపడం ఎంతవరకూ కరెక్ట్ అనేది గంభీర్ ఆలోచించాలని మాజీలు సైతం సూచిస్తున్నారు. అలాగే రెగ్యులర్ గా ఐదో స్థానంలో ఆడే కెఎల్ రాహుల్ ను ఇంకా కిందకి పంపించడం కూడా దెబ్బతీసింది. మిడిలార్డర్ లో రెగ్యులర్ గా ఆడే సీనియర్లు ఆడితేనే భాగస్వామ్యాలు నమోదవుతాయనేది చాలా మంది విశ్లేషణ. దీనికి భిన్నంగా గంభీర్ తీసుకున్న నిర్ణయాలు సిరీస్ ఓటమికి కారణమయ్యాయని అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే లంకతో వన్డే సిరీస్ కోల్పోవడంతో సోషల్ మీడియాలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ట్రోలింగ్ మొదలైంది. 28 ఏళ్ళ తర్వాత వరల్డ్ కప్ గెలిచిన ఘనతను అందుకున్న గంభీర్ అలాగే 27 ఏళ్ళ తర్వాత లంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన ఘనతను సొంతం చేసుకున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడేది ఇక రెండు వన్డే సిరీస్ లే. దీంతో గంభీర్ ఎలాంటి వ్యూహంతో మెగా టోర్నీకి జట్టును సన్నద్ధం చేస్తాడోనని చర్చ జరుగుతోంది.

Read Also : Weight Gain : ఆటగాళ్ల బరువు 6 నుండి 8 గంటల్లో ఎలా పెరుగుతుంది .?